
చెరువులో దూకి వాచ్ మెకానిక్ ఆత్మహత్య
గన్నవరం: కోనాయి చెరువులో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఇస్లాంపేటకు చెందిన మొఘల్ అన్వర్(60) వాచ్ మెకానిక్.. రెండేళ్ల క్రితం అతని భార్య మృతి చెందగా, అప్పటి నుంచి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కోనాయి చెరువులోని పైలెట్ ప్రాజెక్ట్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువు గట్టుపై అతని సైకిల్, చెప్పులు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ శ్రీధర్, సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమారై ఉన్నారు.
బైక్ ఢీ.. వ్యక్తి మృతి
మక్కపేట(వత్సవాయి): బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోళ్ల నాగేశ్వరరావు(45) పంచాయతీ కార్యాలయంలో కొంతకాలంగా స్వీపర్‌గా చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో అతన గోపినేనిపాలెం రహదారివైపు నడుచుకుని వెళ్తుండగా చిల్లకల్లు వైపు నుంచి వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి నాగేశ్వరరావును ఢీకొట్టింది. ఘటనలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. ఘటనపై ఎస్‌ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు.
ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్
10 కేజీల గంజాయి స్వాధీనం
మధురానగర్(విజయవాడసెంట్రల్): గంజాయి విక్రయించడానికి సిద్ధంగా ఉన్న ఐదుగురు యువకులను ఆదివారం గుణదల పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుణదల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎం. ఏడుకొండల గుణశేఖర్, కె.సాయి నితిన్, కొత్తపల్లి వసంత కుమార్, వల్లపు మణికంఠ, కట్ట గోపి ఐదుగురు స్నేహితులు. వీరు మధురానగర్‌లో ఒక రూమ్‌లో ఉంటే వేర్వేరు పనులు చేస్తుంటారు. వీళ్లు జల్సాలు, మద్యం, గంజాయికి బానిసయ్యారు. వీరికి డబ్బులు సరిపోక గంజాయి కొని తీసుకొచ్చి ఇక్కడ అధిక లాభానికి అమ్ముదామని ఆలోచనతో ఐదుగురూ ఒడిశా వెళ్లి అక్కడ మారుమూల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొని తీసుకువచ్చారు. గుణదల రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయిని ఐదుగురు పంచుకొనడానికి రాగా ముందస్తు సమా చారం మేరకు గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీను, గుణదల సిబ్బంది ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వారి నుంచి 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.
అనుమానాస్పద మృతిపై కేసు
కంకిపాడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది. ఎస్‌ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కంకిపాడుకు చెందిన సాయిరాం వరప్రసాద్ సింగ్(62) బ్యాంక్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. అతనికి వివాహమైంది. కుమారై ఉన్నారు. అతని భార్య సుమారు ఐదేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగా నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన సింగ్ అనారోగ్య కారణాలతో మనస్తాపానికి గురై అపార్ట్‌మెంట్ కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 10వ తేదీ జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులు కంకిపాడు పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్ తెలిపారు.

చెరువులో దూకి వాచ్ మెకానిక్ ఆత్మహత్య