
కవులు సమాజాన్నిఅధ్యయనం చేయాలి
విజయవాడ కల్చరల్: కవులు సమాజాన్ని అధ్యయనం చేయాలని కవి నగ్నముని అన్నారు. లలిత పబ్లికేషన్స్ ప్రచురించిన రాధాకృష్ణ కరి రచించిన లైఫ్ డ్రామా, అమూల్యాచందు రచించిన భూమినవ్వడం చూశాను కవితా సంపుటాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని బాలోత్సవ్ భవన్‌లో ఆదివారం నిర్వహించారు. నగ్నముని మాట్లాడుతూ యువ కవుల చేతులో కవిత్వం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. సమాజాన్ని చైతన్య పరిచే అంశాలు అందులో కనిపిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ శాంతి శ్రీ అమూల్యాచందు రచించిన భూమి నవ్వడం చూశాను పుస్తకాన్ని సమీక్ష చేస్తూ అమూల్య కవిత్వంలో సమాజ ప్రేరేపిత అంశాలు కనిపిస్తాయన్నారు. కవిత్వంలో ఆమె వాడిన పదాల కూర్పు, పదబంధాలు ఆలోచింప చేస్తాయన్నారు. రాధాకృష్ణ కవిత్వాన్ని కవయిత్రి వాణిశ్రీ నైనాల సమీక్షించారు. సీనియర్ కవి వసీరా సుధామురళి ప్రసంగించారు. నగ్నముని కవితా సంపుటాలను ఆవిష్కరించారు.
పదోన్నతులు కల్పించండి
ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు వీకేఎన్ జయలక్ష్మి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో 28 ఏళ్లుగా ఉద్యోగోన్నతి లేకుండా చేస్తున్న సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని ఏపీ ఉమెన్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అండ్ ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వీకేఎన్ జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ హాల్లో ఆదివారం సంఘ సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ నుంచి సూపర్‌వైజర్లుగా పదోన్నతి కల్పించాలన్నారు. 2211 హెడ్ కింద పని చేస్తున్న ఎంపీహెచ్‌ఏ(ఎఫ్)లకు ఐదేళ్లుగా రవాణా భత్యాలు లేవన్నారు. ప్రభుత్వం స్పందించి రవాణాభత్యం ఇప్పించాలని కోరారు. రెగ్యులర్ ఎంపీహెచ్‌ఏ(ఎఫ్) రీడిప్లాయ్‌మెంట్ రద్దు చేసి బదిలీలు చేయాలని కోరారు. ఫీల్డ్ స్టాఫ్‌కు ఎఫ్‌ఆర్‌ఏ రద్దు చేయాలని కోరారు. నర్సెస్ డే సందర్భంగా ఏఎన్‌ఎంలను ఘనంగా సత్కరించారు. సమావేశంలో ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రమీల, ఎస్‌వీ మహాలక్ష్మి, బి.విమల, కె.మురళీకృష్ణ, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

కవులు సమాజాన్నిఅధ్యయనం చేయాలి