
ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి నెలకొంది. దుర్గామల్లేశ్వరస్వామివార్లను ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకల నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఆదిదంపతులకు జరిగిన పలు ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమం, లక్ష కుంకుమార్చన విశేషంగా జరిగాయి. లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్లలో అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు
రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు త్వరత్వరగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. అమ్మవారి ఆలయంలో సూర్యోపాసన సేవ జరిగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, అనంతరం పల్లకీ సేవలోనూ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మోపిదేవిలో..
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. తెల్లవారుజాము నుంచే తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. నాగపుట్ట, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి