
మహిళలపై పోలీసుల తీరు అమానవీయం
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో మహిళలపై పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా విడదల రజనిపై పోలీసులు ప్రదర్శించిన తీరే నిదర్శనమన్నారు. వారి వైఖరిని ఖండిస్తున్నామన్నారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు దేశంలో యుద్ధవాతావరణం నెలకొంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా కట్టడి చేయాలి, ఎలా కక్ష తీర్చుకోవాలనే దానిపై దృష్టి పెట్టినట్లు ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రజని విషయంలో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే రౌడీల్లా వ్యవహరించడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో ఆ ఘటనే ఉదాహరణ అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్టంలో చేసిందేమీ లేదన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన ఎటు పోతోందో అర్థం కావడం లేదని, బీసీ, దళిత మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించారన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలని, తప్పనిసరిగా చట్టం ముందు నిలబడి మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.