
అదును చూసి మట్టి అక్రమ తవ్వకాలు
సెలవు రోజులే లక్ష్యంగా తవ్వేస్తున్న మట్టి మాఫియా
ఘంటసాల: మండలంలో మట్టి మాఫియా అదును చూసి అక్రమ తవ్వకాలు చేపడుతోంది. సెలవు రోజులే లక్ష్యంగా అర్ధరాత్రులు హడావుడిగా మట్టి తవ్వేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి ఘంటసాల మండలం తెలుగురావుపాలెం శివార్లలో రాత్రికి రాత్రే మట్టి తవ్వకాలు చేశారు. తెల్లవారి ఆదివారం మట్టి తవ్వకాలు చూసి గ్రామస్తులు నివ్వెరపోతున్న పరిస్థితి నెలకొంది. ఘంటసాల గ్రామంలోని మల్లంపల్లి రోడ్డులో శనివారం రాత్రి టిప్పర్లతో భారీగా మట్టిని తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘంటసాల మండలంలో సెలవు రోజే లక్ష్యంగా జరుగుతున్న మట్టి మాఫియా ఆగడాలను అధికారులు అరికట్టాలని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.