
బైక్ చోరీల ముఠా ఆటకట్టు
కంకిపాడు: కంకిపాడు పోలీసులు మోటారు బైక్‌ల చోరీ ముఠా ఆటకట్టించారు. ఈ కేసులో నలుగురి నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ మేరకు కంకిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు శనివారం కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 25న గంగూరు గ్రామానికి చెందిన మహమ్మద్ జివుల్ రెహమాన్ ఈడుపుగల్లులోని మసీదు వద్ద నమాజ్ చేసుకునేందుకు తన స్నేహితుడి మోటారు బైక్‌పై వచ్చాడు. నమాజ్ చేసుకుని బయటకు వచ్చి చూసే సరికి బైక్ కనిపించలేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జె.మురళీకృష్ణ, ఎస్‌ఐ డి.సందీప్ కంకిపాడు పట్టణంలోని ఫ్లై ఓవర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా యువకులు రెండు మోటారు బైక్‌లపై వెళ్తూ పట్టుబడ్డారు. వారి వాహనాలకు రికార్డులు లేకపోవటంతో గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ద్విచక్ర వాహనాలను చోరీ చేసే ముఠాగా గుర్తించారు.
రూ.21.46 లక్షల విలువైన 50 బైక్‌ల రికవరీ
కృష్ణాజిల్లాలోని కంకిపాడు, పెనమలూరు, పెడన, మచిలీపట్నం, గుడ్లవల్లేరు, ఎన్టీఆర్ జిల్లాలోని భవానీపురం, మాచవరం, విజయవాడ టూ టౌన్, గుంటూరు జిల్లా కొత్తపేట, మంగళగిరి టౌన్, ఏలూరు జిల్లాలోని ఏలూరు టూ టౌన్, బాపట్ల జిల్లాలోని రేపల్లె పోలీసుస్టేషన్లలో మొత్తం ఐదు జిల్లాల పరిధిలో 17 పోలీసుస్టేషన్లలో రూ.21.46 లక్షల విలువైన 50 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు విచారణలో నేరం అంగీకరించారు. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన మొహమ్మద్ రిజ్వాన్, కోడూరు మండలం గౌడపాలెంకు చెందిన కేశన సురేష్, ఉల్లిపాలెం గ్రామానికి చెందిన షేక్ ఇబ్రహీం, కోలా కృష్ణారావులను మోటారు బైక్‌ల చోరీ కేసులో నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ముందుగానే చోరీ చేసేందుకు ఒక ప్రాంతాన్ని ఎంచుకుని సీసీ కెమెరాల్లో చిక్కకుండా ఉండేలా హెల్మెట్ ధరించి చోరీలకు పాల్పడటం ఈ ముఠా నైజమన్నారు. ఫంక్షన్ హాల్స్, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, హాస్పిటల్స్ వద్ద పార్కు చేసి ఉన్న వాహనాలే వీరి లక్ష్యంగా పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. కేసు విచారణలో ప్రత్యేక చర్యలు తీసుకున్న సీఐ జె.మురళీకృష్ణ, ఎస్‌ఐ డి.సందీప్, హెచ్‌సీ కె.చంద్రబాబు, పీసీలు పీఎస్‌ఎన్ మూర్తి, ఎస్‌డి బాబీబాబులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.