
సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ ప్రారంభం
లబ్బీపేట(విజయవాడతూర్పు): క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడం ద్వారా తొలిదశలో గుర్తించి, పూర్తిగా నయం చేసేందుకు అవకాశం ఉంటుందని టెలికం రంగ దిగ్గజం ఎన్‌కే గోయల్ సూచించారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచడం, క్యాన్సర్ రోగులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్‌ను ఆయన శనివారం ఆవిష్కరించారు. విజయవాడ మహాత్మాగాంధీరోడ్డులోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో గోయల్ మాట్లాడుతూ.. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో స్వచ్ఛంద సంస్థల కృషి ఎంతో కీలకమన్నారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎన్.సుబ్బారావు మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధి బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు, అందుబాటులో ఉన్న చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధిని జయించేందుకు అవసరమైన తోడ్పాటు అందించాలన్నారు.
క్యాన్సర్ విముక్త భారత నిర్మాణానికి కృషి..
ఇండియన్ రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(ఐఆర్‌ఐఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వేమూరి వరప్రసాద్ మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స ప్రభావవంతంగా ఉంటుందన్నారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా క్యాన్సర్ విముక్త భారత నిర్మాణానికి సిటిజెన్ ఫోర్స్ కృషి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సిటిజెన్ ఫోర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పిన్నంశెట్టి రమేష్‌బాబు మాట్లాడుతూ.. క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణం కోసం సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ పని చేస్తుందన్నారు. ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.వి.మోహన్ ప్రసాద్, సినీ నటి చంద్రానీదాస్ తదితరులు పాల్గొన్నారు.