
గంజాయి విక్రేత మనోజ్‌పై పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ అమలు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): గంజాయి సరఫరా, పలు చోరీ కేసుల్లో నిందితుడైన నగరానికి చెందిన తుమ్మల మనోజ్‌పై నగర పోలీసులు పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ అమలు చేశారు. విజయవాడ నగరంతో పాటు పలు జిల్లాల్లోని విద్యాసంస్థల వద్ద గంజాయి విక్రయిస్తూ యువతను మత్తుకు బానిసలు చేయడమే లక్ష్యంగా పనులు నిర్వహించడం ఇతని నైజం. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌ఆర్‌పీ రోడ్డులో నివాసముండే తుమ్మల మనోజ్‌పై 2011లో తొలిసారిగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసు నమోదైంది. ఆ తరువాత 2012లో మరో కేసు నమోదు కాగా అప్పటి నుంచి వరుసగా గంజాయి విక్రయిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. సత్యనారాయణపురం, వన్‌టౌన్, కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, భవానీపురం, కృష్ణలంక, విశాఖపట్నంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో 28 సార్లు గంజాయి అమ్ముతూ పట్టుబడి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత కూడా తన నేర ప్రవృత్తిని కొనసాగించేవాడు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగ జేస్తున్నందున అతనిపై పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్–1988 అమలు చేస్తూ పోలీసుశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగర ఇన్‌చార్జి పోలీసు కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వుల మేరకు శనివారం పశ్చిమ ఏడీసీపీ జి.రామకృష్ణ పర్యవేక్షణలో నార్త్ ఏసీపీ స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం ఇన్‌స్పెక్టర్ లక్ష్మినారాయణ మనోజ్‌ను అదుపులోనికి తీసుకున్నారు. న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.