
టెన్త్ టాపర్ల విమానయానం
విమానాశ్రయం(గన్నవరం): పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడానికి అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఉత్తమ మార్కులు సాధించిన తొమ్మిది మంది విద్యార్థులను ఎంపిక చేసిన ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో వారిని కడప నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు విమానంలో తీసుకొచ్చారు. అనంతపురం జిల్లా కోనాపురం స్కూల్ హెచ్‌ఎం ఎస్.రమేష్‌బాబు, పెద్దవడుగూరు హైస్కూల్ ఉపాధ్యాయిని ఎన్.హేమలత పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన తొమ్మిది మంది విద్యార్థులకు విమాన ప్రయాణ అవకాశం కల్పించడానికి ముందుకొచ్చారు. పెదవడుగూరు మండలంలోని ఏడు హైస్కూల్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన ఎనిమిది మందిని, వికలాంగుల్లో ఒకరిని ఎంపిక చేశారు. మొత్తం తొమ్మిది మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు రూ.50 వేలు వెచ్చించి శనివారం కడప ఎయిర్‌పోర్ట్ నుంచి గన్నవరానికి ఇండిగో విమానంలో వెంట తీసుకువచ్చారు. మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్న విద్యార్థులు సంతోషంతో కేరింతలు కొట్టారు. పేద కుటుంబాలకు చెందిన తమను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చి విమాన ప్రయాణం చేయాలనే కలను నేరవేర్చిన హెచ్‌ఎం రమేష్‌బాబు, ఉపాధ్యాయిని హేమలతకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులను విజయవాడ సందర్శనార్థం ఉపాధ్యాయులు తీసుకెళ్లారు.