విద్యార్థులకు స్వేచ్ఛనిద్దాం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు స్వేచ్ఛనిద్దాం

May 11 2025 12:26 PM | Updated on May 11 2025 12:26 PM

విద్యార్థులకు స్వేచ్ఛనిద్దాం

విద్యార్థులకు స్వేచ్ఛనిద్దాం

మచిలీపట్నానికి చెందిన కుమార్‌కు ఆర్ట్స్‌ గ్రూపు అంటే ఇష్టం. చిన్నతనం నుంచే సోషల్‌ సంబంధిత సబ్జెక్ట్‌లపై మంచి పట్టుసాధించాడు. గ్రూప్స్‌ రాయాలనేది అతని కోరిక. పది పూర్తయ్యాక ఆర్ట్స్‌ గ్రూపులో చేరాలనుకున్నాడు. ఇంట్లో పెద్దల బలవంతంతో ఎంపీసీలో చేరాడు. అతను చదవలేక ఫెయిలయ్యాడు.

గుడివాడకు చెందిన గణేష్‌కు చిన్నతనం నుంచే సీఏ చేయాలన్నది కోరిక. పది పూర్తయ్యాక ఎంఈసీలో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులేమో కొడుకును ఇంజినీరుగా చూడాలనుకున్నారు. అతన్ని బలవంతంగా ఎంపీసీలో చేర్పించారు. అయిష్టంతో చదివిన అతను ఎంపీసీని పాస్‌ మార్కులతో గట్టెక్కాడు. ఇంజినీరింగ్‌లో సీటు రాకపోవడంతో డిగ్రీలో ఆర్ట్స్‌ గ్రూప్‌ తీసుకున్నాడు.

జగ్గయ్యపేటకు చెందిన హారికకు చిన్నప్పటి నుంచే లెక్కలు అంటే ఇష్టం. ఇంజినీరింగ్‌ చేయాలన్నది ఆమె కోరిక. తల్లిదండ్రులకు కుమార్తెను డాక్టరుగా చూడాలనుకున్నారు. ఆ తపనతో వారు ఆమెను బైపీసీలో బలవంతంగా చేర్పించారు. పాస్‌ మార్కులతో గట్టెక్కడంతో మెడిసిన్‌లో సీటు రాలేదు. అప్పటికిగానీ తల్లిదండ్రులు వారి తప్పును తెలుసు కోలేకపోయారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఇంటర్‌లో గ్రూపులు ఎంచుకునే స్వేచ్ఛను పిల్లలకివ్వాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రుల ఒత్తిడితో మక్కువ లేని సబ్జెక్టులు తీసుకుని చదవలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంటర్‌ ప్రవేశ సమయంలో తల్లిదండ్రుల బల వంతంతో కొందరు, గొప్పగా చెప్పుకోవాలనే ఆలోచనతో మరికొందరు ఇష్టం లేని గ్రూపుల వైపు అడుగులేసి చతికిలపడుతున్నారు.

ఇంటర్‌ కీలకం

విద్యార్థి దశలో ఇంటర్‌ కీలకం. ఈ దశలో పడిన అడుగు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పది పరీక్షలు రాసి ఇంటర్‌ ప్రవేశాల కోసం వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. పిల్లల ఆసక్తి తెలుసుకుని ప్రోత్సహించాలి. అప్పుడే వారు రాణించగలుగుతారు.

ఇష్టాన్ని గుర్తించాలి

పిల్లల ఇష్టాలను పక్కనబెట్టి డాక్టర్‌, ఇంజినీర్‌ చేయాలని తల్లిదండ్రులు కలలుకంటున్నారు. తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దుతున్నారు. మేము చెప్పే కోర్సులను తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో విద్యార్థులు వారి ఆసక్తిని పక్కనబెట్టి తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో చేరి రాణించలేకపోతున్నారు. పిల్లల ఇష్టాన్ని గుర్తించినప్పుడే రాణిస్తారన్న సత్యాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలని మానసిక శాస్త్రవేత్తలు హితవు పలుకుతున్నారు.

జిల్లాలో పది ఉత్తీర్ణులైనవారు 41,260 మంది

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 48,243 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 41,260 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కొందరు ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో చేరడానికి సన్నద్ధమవుతున్నారు. ఇంకొందరు ప్రభుత్వ కళాశాలల్లో చేరనున్నారు. మరికొందరు పాలిటెక్నిక్‌, ఏపీఆర్‌ జేసీ వంటి పోటీ పరీక్షలతో ఆయా కోర్సుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పాస్‌ మార్కులతో గట్టెక్కిన విద్యార్థులు తక్కువ సమయంలో ఉపాధి లభించే ఐటీఐ, ఒకేషనల్‌ కోర్సులను ఎంచుకుంటున్నారు. సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ఇప్పటికే విద్యార్థులు ప్రణాళిక రచించుకున్నారు. ఇలాంటి సమయంలో ఏది ఉత్తమం, ఏ కోర్సులు తీసుకోవాలి వంటి సలహాలు ఇవ్వడం వరకే తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావించాలి. గ్రూపుల ఎంపికలో పిల్లలకు స్వేచ్ఛ నివ్వాలని నిపుణులు చెబుతున్నారు.

పిల్లల భవిత.. పెద్దల బాధ్యత

గ్రూపుల ఎంపికలో పిల్లలకు స్వేచ్ఛనివాలంటున్న విద్యావేత్తలు

తల్లిదండ్రుల నిర్ణయాలతో పిల్లలకు కష్టాలు

వారి ఇష్టాన్ని గుర్తించాలంటున్న విద్యావేత్తలు

బలవంతం చేస్తే మొదటికే మోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement