
కొల్లగొట్టేస్తున్నారు
●యథేచ్ఛగా మట్టి, బుసక తవ్వకాలు ●రోజుకు రూ.కోటికి పైగా అక్రమ వ్యాపారం ●కూటమి నేతల అక్రమ దందా ●ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు ●రాత్రీ పగలు తేడా లేకుండా తవ్వకాలు
అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో కూటమి నేతలు సహజ వనరులను కొల్లగొట్టేస్తున్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా పలు ప్రాంతాల్లో మట్టి, బుసక, ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా జరిగే ఈ తవ్వకాలతో ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. రోజుకు రూ.కోటికి పైగా అక్రమ రవాణా జరుగుతుందంటే ఏ స్థాయిలో దందా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
టిప్పర్ బుసక రూ.5 వేలు
జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో పలుచోట్ల పెద్ద ఎత్తున మట్టి, బుసక అక్రమ రవాణా సాగుతోంది. ఈ ప్రాంతాల్లో రోజుకు కోటి రూపాయలకు పైగా అక్రమ రవాణా జరుగుతుందంటేనే ఏ స్థాయిలో దందా చేస్తున్నారో తెలుస్తోంది. చెరువులు పూడిక, పొలాల మెరక పేరుతో అనుమతులు తీసుకుని యథేచ్ఛగా వ్యాపారం సాగిస్తున్నారు. ట్రక్కు ట్రాక్టర్ మట్టి రూ.1,200 నుంచి రూ.1,600, టిప్పర్ బుసక రూ.4 వేల నుంచి రూ.5 వేలకు అమ్ముతున్నారు.
నాగాయలంకలో టీడీపీ బడానేతదే దందా..
నాగాయలంక, కోడూరు, ఘంటసాల మండలాల్లో పెద్ద ఎత్తున మట్టి అక్రమ రవాణా సాగుతోంది. ‘నాగాయలంక’లో టి.కొత్తపాలెం, పెదపాలెంలో పంట పొలాల మెరక తీసే పేరుతో మట్టి మాఫియాను అడ్డం పెట్టుకుని ఓ బడా టీడీపీ నేత గత పది రోజుల నుంచి మట్టి అక్రమ దందా సాగిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘కోడూరు’లో స్వతంత్య్రపురం, కృష్ణాపురం, కోడూరు, ఉల్లిపాలెం, ‘ఘంటసాల’లో జోడిగూడెం, తాడేపల్లిలో మట్టి అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి.
పెడనలో ఎమ్మెల్యే అనుచరులే..
పెడన నియోజకవర్గంలో బంటుమిల్లి, గూడూరు, కృత్తివెన్ను, పెడన మండలాల్లో పెద్ద ఎత్తున మట్టి, బుసక తవ్వకాలు జరుగుతున్నాయి. పెడనలో ఎమ్మెల్యే అనుచరులే రాత్రి వేళలో బుసక, మట్టి తవ్వకాలు చేస్తున్నారు. గూడూరులో టీడీపీ నాయకులు సాగిస్తున్న అక్రమ తవ్వకాలపై జనసేన నేతలు ఫిర్యాదులపై ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకున్నవారే లేరు. బంటుమిల్లిలో అక్రమ తవ్వకాలు చేస్తున్న పార్టనర్స్ ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి నెలకొంది.
మంత్రి హెచ్చరికతో పెట్రేగి పోతున్నారు..
ఇటీవల చల్లపల్లిలో జరిగిన టీడీపీ సమావేశంలో మట్టితోలుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సుభాష్ దృష్టికి తీసుకురాగా ఆయన ఓ పోలీస్ బాస్‌కు ఫోన్ చేసి మా వాళ్ల జోలికి రావొద్దని హెచ్చరించినట్టు తెలిసింది. అప్పటి నుంచి దివిసీమలో మట్టి అక్రమ దందా మరింత పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఆందోళన చేస్తున్న గ్రామస్తులు
ప్రమాదాలు జరుగుతున్నా పట్టడం లేదు..
మట్టి, బుసక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్ల స్పీడుకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇష్టారాజ్యంగా స్పీడుగా వాహనాలు నడపడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకో కపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మచిలీపట్నం మండలం బుద్దాయిపాలెంలో మట్టి ట్రాక్టర్ కింద పడి ఇటీవల విద్యార్థి మరణించగా, నాగాయలంక మండలం టి.కొత్తపాలెంలో రెండు రోజుల వ్యవధిలో మట్టి ట్రాక్టర్లు ఢీ కొని ఇద్దరు గాయాల పాలయ్యారు. టిప్పర్లు, ట్రాక్టర్లపై ఎలాంటి పట్టాలు లేకుండా తోలడం వల్ల స్పీడ్ బ్రేకర్లు, గోతుల వద్ద మట్టిగడ్డలు, బుసక పడి వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.
మచిలీపట్నంలో మంత్రి అనుచరులే..
మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి అనుచరులే మట్టి, బుసక అక్రమ దందా సాగిస్తున్నారు. చిన్నాపురం, చినయాదర, పెద పట్నం, పోతేపల్లి, గూడూరు, మంగినపూడి పోర్టు భూముల్లో కొన్ని చోట్ల మట్టి, బుసక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ప్రతి రోజూ రాత్రి వేళల్లో వందలాది టిప్పర్లు మట్టి, బుసకను ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ట్రాక్టర్ల సంగతి చెప్పనక్కర లేదు. టీడీపీ నాయకులతో పాటు జనసేన నేతలు ఇక్కడ మట్టి, బుసక దందా సాగిస్తున్నారు.
అవనిగడ్డ: మట్టి అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్లు అధిక లోడుతో వెళ్లడంతో రహదారులు దెబ్బతింటున్నాయని, వీటిని వెంటనే ఆపాలని నాగాయలంక మండల పరిధిలోని గణపేశ్వరం గ్రామస్తులు శనివారం ఆందోళన చేశారు. పుల్లయ్యగారిదిబ్బ, దిండి, సొర్లగొంది, పెదగౌడపాలెం నుంచి మూడురోజులుగా విచ్చలవిడిగా టిప్పర్లు వెళ్తున్నాయని దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదని, వీటితో రోడ్లు దెబ్బతింటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నాగాయలంక తహసీల్దార్‌తో చెప్పినా ఫలితం లేదని, అక్రమ మట్టి తవ్వకాలను ఆపకపోతే తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.

కొల్లగొట్టేస్తున్నారు

కొల్లగొట్టేస్తున్నారు