ఎన్టీటీపీఎస్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం | - | Sakshi
Sakshi News home page

ఎన్టీటీపీఎస్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

May 11 2025 12:26 PM | Updated on May 11 2025 12:26 PM

ఎన్టీ

ఎన్టీటీపీఎస్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్‌లోని రెండు యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం ఒకటో యూనిట్‌ సాంకేతిక లోపంతో నిలిచింది. దీంతో 210 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఆ తర్వాత కొంతసేపటికి 8వ యూనిట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌ లీకవడంతో యూనిట్‌ను షట్‌డౌన్‌ చేయడానికి ఇంజినీర్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎర్త్‌ అయ్యి ఒక్కసారిగా ప్లాంటు మొత్తం నిలిచి పోయింది. ఈ పరిణామాలతో 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పతి ఆగిపోయింది. రెండు యూనిట్లో మొత్తం 1,010 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇంజినీరింగ్‌ అధికారులు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మరమ్మతులు చేసినా రెండు ప్లాంట్లు వినియోగంలోకి రాలేదని అధికారులు తెలిపారు.

విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం

విమానాశ్రయం(గన్నవరం): ఇండియా–పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయం ప్రవేశం వద్ద వాహనాలను క్షుణంగా తనిఖీ చేసిన తర్వాతే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. ప్రయాణికులను మాత్రమే ఎయిర్‌పోర్ట్‌లోకి పంపిస్తున్నారు. విమానాశ్రయ సందర్శనకు వచ్చే విజిటర్లను భద్రత కారణాల దృష్ట్యా లోపలికి అనుమతించడం లేదు. టెర్మినల్‌లో ప్రయాణికులు, వారి లగేజీని పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లో పోలీస్‌ భద్రతను పెంచడంతో పాటు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.

13న ఉమ్మడి జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపిక

విజయవాడస్పోర్ట్స్‌: ఉమ్మడి కృష్ణా జిల్లా అండర్‌–16 బాలుర క్రికెట్‌ జట్టును ఈ నెల 13వ తేదీ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎంపిక చేస్తున్నట్లు కృష్ణా జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2009 సెప్టెంబర్‌ ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారు పోటీలకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్‌, జనన ధ్రువీకరణ పత్రం, వైట్‌ డ్రస్‌, స్పోర్ట్స్‌ షూస్‌, సొంత కిట్‌తో ఆ రోజు ఉదయం ఏడు గంటలకు ఎంపిక ప్రాంగణంలో సంప్రదించాలని సూచించారు. జట్టుకు ఎంపిౖకైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.

డ్రెస్‌ కోడ్‌ పాటించరే..!

పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట): పెనుగంచి ప్రోలులోని తిరుపతమ్మ ఆలయ ఈఓ బి.హెచ్‌.వి.ఎస్‌.ఎన్‌.కిషోర్‌కుమార్‌ శనివారం డ్రెస్‌ కోడ్‌ పాటించకుండానే అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణకు భిన్నంగా వన్‌థర్డ్‌ (షార్ట్‌), టీషర్టుతో అమ్మవారిని దర్శించుకోవడంతోపాటు ఆలయ పరిసరాలను సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆలయ ఉద్యోగులు అందరూ తెల్లని సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంది. ఉద్యోగులందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన ఆలయ కార్య నిర్వాహణాధికారే డ్రెస్‌ కోడ్‌ పాటించకపోవడంపై భక్తులు అభ్యంతరం తెలుపుతున్నారు.

దుర్గమ్మ సన్నిధిలో సమంత

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను హీరోయిన్‌ సమంత శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సమంతను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి అమ్మవారి ప్రసాదాలు, రవికను అందజేశారు. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఆలయంలోకి రావడానికి అభిమానులు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఎన్టీటీపీఎస్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం 1
1/2

ఎన్టీటీపీఎస్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

ఎన్టీటీపీఎస్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం 2
2/2

ఎన్టీటీపీఎస్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement