
సైనికుల త్యాగాలు మరువలేనివి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వీర జవాన్ మురళీనాయక్‌కు నివాళులర్పిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం (సామాజిక న్యాయ మహా శిల్పం) వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి.. మురళీనాయక్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన చేసి రెండు నిముషాలు మౌనం పాటించారు. వుయ్ స్టాండ్ విత్ ఇండియన్ ఆర్మీ, మురళీ నాయక్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ యుద్ధంలో మురళీనాయక్ మరణించాడన్న వార్త తెలిసిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారని, ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారన్నారు. ఈనెల 13న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా మురళీనాయక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదారుస్తారన్నారు. మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసుల దాడి దుర్మార్గమన్నారు.
రజనిపై పోలీసుల దాడి అమానుషం
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీ మహిళ, మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమన్నారు. సెంట్రల్ సమన్వయకర్త మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
● వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
● వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటాం