
విజయవాడ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నగరంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసులు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్‌లో మాక్ డ్రిల్ ద్వారా ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పించారు. అందులో భాగంగా జిల్లా పోలీసులు, జీఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. డీసీపీ వరప్రసాద్ పర్యవేక్షణలో ఏడీసీపీ రామకృష్ణ ఆదేశాల మేరకు నార్త్, వెస్ట్ ఏసీపీలు స్రవంతిరాయ్, దుర్గారావు ఆధ్వర్యంలో పోలీసులు ఏడు బృందాలుగా విడిపోయి రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్‌లు, పార్శిల్ కార్యాలయం, స్టేషన్ పరిసర ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్, ఎంఎస్‌సీడీ, హెచ్‌హెచ్‌ఎండీ పరికరాలతో తనిఖీ చేశారు. వీటితో పాటు రైల్వే స్టేషన్ పరిసరాలైన బొగ్గులైన్ క్వార్టర్స్, వెస్ట్ బుకింగ్, తారాపేట, నైజాంగేటు, రాజరాజేశ్వరిపేట, కంసాలీపేట తదితర ప్రాంతాలలో అనుమానితుల కోసం డ్రోన్‌లతో జల్లెడపట్టారు.
నిరంతర నిఘా..
ఈ సందర్భంగా ఏడీసీపీ రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని ప్రాంతాలకు కేంద్రబింధువుగా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్‌లో నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. సిటీ సెక్యూరిటీ వింగ్ డీసీపీ ప్రేమ్‌కుమార్, ఎస్‌ఎన్ పురం, భవానీపురం సీఐలు లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వరరావు, జీఆర్‌పీ సీఐలు జేవీ రమణ, దుర్గారావు, ఆర్‌పీఎఫ్ సీఐ ఆలీ బేగ్ వారి సిబ్బంది పాల్గొన్నారు.