
తీర ప్రాంతాల్లో నిఘా పటిష్టం
కోనేరుసెంటర్: సముద్ర తీర ప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు మైరెన్ పోలీసులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాలను శుక్రవారం ఆయన స్వయంగా పరిశీలించారు. గిలకలదిండి మైరెన్ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ న్యూ ఫిషింగ్ హార్బర్ నుంచి మైరెన్ పోలీసులతో కలిసి బోటులో సముద్ర మొగ వరకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో శత్రు దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. శత్రు దేశాలు భారత భూభాగంలోకి సముద్ర మార్గం గుండా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. సముద్ర తీర ప్రాంతాలైన గిలకలదిండి, ఓర్లగొంది, పాలకాయతిప్ప మైరెన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని తీర ప్రాంత గ్రామాలు అన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. సముద్ర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉండేలా మైరెన్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు.