
ఇంటర్ సప్లిమెంటరీకి ఏర్పాట్లు షురూ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. జిల్లా వ్యాప్తంగా 73 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనుంది. మధ్యాహ్నం పరీక్షలను 23 పరీక్ష కేంద్రాలను ఇంటర్మీడియెట్ బోర్డు ఎంపిక చేసింది. అన్ని పరీక్షలకు కలిపి మొత్తం సుమారు 34,564 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ఫస్టియర్‌కు సంబంధించి సుమారుగా 28,999 మంది విద్యార్థులు పరీక్షకు హజరవుతున్నారు. వీరిలో అత్యధికంగా బెటర్‌మెంట్‌కు హజరవుతున్నవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుమారుగా 5,565 మంది సెకండియర్ పరీక్షకు హాజరవుతున్నారు. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
రెండు రోజుల్లో సమన్వయ సమావేశం
ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ నేతృత్వంలో త్వరలో విజయవాడ నగరంలో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఇంటర్ బోర్డు అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ, పోలీసు, పోస్టల్, రెవెన్యూ, మున్సిపల్, డీఈఓ, డీపీవో తదితర ఎనిమిది శాఖలతో కూడిన సమావేశం జరగనుంది. ప్రధానంగా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డెస్క్‌లు, తాగునీరు, టాయిలెట్లు తదితర సౌకర్యాలను కల్పించే అంశంపై సమీక్షించనున్నారు. ముఖ్యంగా మండుతున్న ఎండలకు విద్యార్థులు అవస్థలు పడకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుంది.
జిల్లాలో పరీక్ష రాయనున్న
34,564 మంది విద్యార్థులు
మొదటి ఏడాదికి 73,
రెండో ఏడాదికి 23 పరీక్ష కేంద్రాలు
అన్ని చర్యలు తీసుకుంటున్నాం..
విద్యార్థులు చక్కగా పరీక్షలకు హాజరయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వివిధ శాఖల సాయంతో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు వీలుగా ఆయా ఏర్పాట్లు చేస్తున్నాం. కలెక్టర్ అధ్యక్షతన త్వరలో సమన్వయ సమావేశం జరగనుంది. వివిధ శాఖలకు చెందిన అధికారులు అందులో పాల్గొని ఏర్పాట్లకు చర్యలు తీసుకోనున్నారు. మౌలిక సదుపాయాలతో పాటు మండుతున్న ఎండల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– ప్రభాకరరావు,
ఆర్‌ఐఓ, ఎన్టీఆర్ జిల్లా