
ఇంగ్లిష్‌లో ‘పవర్’ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
అది ఓ మారుమూల గ్రామం.. అందులో ఓ ప్రాథమిక పాఠశాల.. పరిమిత సంఖ్యలో ఉండే విద్యార్థులు.. వారికి వాడుక భాష తప్ప.. తెలుగు కూడా సరిగ్గా రాని పరిస్థితి. అలాంటి వారు జాతీయ స్థాయి వేదికపై ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడటం, రాయడం అంటే ఆషామాషీ కాదు. కానీ దానిని సుసాధ్యం చేసి చూపించారు ఈ బుడతలు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పుణ్యమాని ఇంగ్లిష్ మీడియంలో చదువుతూ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా 30లక్షల మంది విద్యార్థులతో పోటీ పడి తమ పాఠశాల, గ్రామం, జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని చాంపియన్‌గా నిలిపి వారెవ్వా వండర్ కిడ్స్ అనిపించుకున్నారు.
జి.కొండూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య అనేది చారిత్రక తప్పిదంలా నానా యాగీ చేసిన నేటి పాలకులకు, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు సాధిస్తున్న అద్భుత ఫలితాలు చెంపపెట్టులా మారాయి. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండల పరిధి కనిమెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. మారుమూల పల్లెటూరులో ఉన్న ఈ పాఠశాల ఇప్పుడు దేశంలోనే హాట్ టాఫిక్‌గా మారింది. జాతీయ స్థాయి ఇంగ్లిష్ వర్డ్ పవర్ చాంపియన్ షిప్ పోటీలలో మొదటి రెండు స్థానాలను కై వసం చేసుకొని, రాష్ట్రానికి ఓవరాల్ చాంపియన్ ట్రోఫీని సాధించి.. కార్పొరేట్ పాఠశాలలకు తామేమీ తక్కువ కాదని నిరూపించారు ఇక్కడి విద్యార్థులు.
పట్టు సాధించే విధంగా..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం విద్యను అమలు చేసిన నాటి నుంచి కనిమెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ విద్యా బోధన జరుగుతోంది. ఈ పాఠశాలకు మండవ విజయలక్ష్మి ఒక్కరే ఉపాధ్యాయురాలుగా, హెచ్‌ఎంగా పని చేస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లిష్‌పై పట్టు సాధించే విధంగా విజయలక్ష్మి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం అందించిన పుస్తకాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వినూత్న పద్ధతుల్లో అదనంగా ప్రతి రోజూ ముప్పై నిముషాలు ప్రత్యేక తరగతి నిర్వహించి బోధన చేశారు.
పేద కుటుంబ నేపథ్యం..
కనిమెర్ల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన అన్నా చెల్లెళ్లు బి.రేవంత్‌కుమార్, బి. సింధు ప్రియ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి పేరు తెచ్చారు. ఈ చిన్నారుల తండ్రి భూపతి ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తుండగా, తల్లి దయామణి వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నివసించడానికి పక్కా ఇల్లు కూడా లేని ఈ కుటుంబం నుంచి ఇద్దరు చిన్నారులు జాతీయస్థాయిలో ప్రతిభచాటి రాష్ట్రానికి, జిల్లాకి, కనిమెర్ల గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టారు. వీరిద్దరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ సైతం వీరిద్దరితో పాటు హెచ్‌ఎం విజయలక్ష్మిని సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు.
గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంగ్లిష్ మీడియం విద్యతో సత్ఫలితాలు
‘నాడు–నేడు’తో
జాతీయ ఇంగ్లిష్ వర్డ్ పవర్
చాంపియన్ షిప్ పోటీల్లో సత్తా
మొదటి రెండు స్థానాలు కై వసం
చేసుకున్న
అన్నా చెల్లెళ్లు
ప్రభుత్వ
పాఠశాలలో
చదువుతూనే
అద్భుతాలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు పాఠశాలలకు మెరుగైన వసతులను అందించడమే లక్ష్యంగా గత ప్రభుత్వం చేపట్టిన ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద కనిమెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఆధునికీకరణ కోసం రూ.12లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఈ నిధులతో భవనం మరమ్మతులు, ప్రహరీ నిర్మాణం, టాయిలెట్‌ల రిపేర్లు, అత్యాధునిక సామగ్రి, విద్యోపకరణాలు అందించడం వంటి పనులను చేశారు.

ఇంగ్లిష్‌లో ‘పవర్’ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు