
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
భవానీపురం(విజయవాడ పశ్చిమ): విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టి వారిలో స్ఫూర్తి నింపేందుకే నగదు పురస్కారాలను అందజేస్తున్నామని మంత్రులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల వసతి గృహాల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించారు.
అభినందనీయం..
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మంచి ఫలితాలు రావడం అభినందనీయమన్నారు. నీట్ పరీక్షల్లో ఉచిత కోచింగ్ సెంటర్లను ఈ ఏడాది నుంచి 10కి పెంచుతున్నామని చెప్పారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు రెండు నెలలకు ఒక సారి కాస్మొటిక్ కిట్స్, నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తామన్నారు. గురుకులాల్లోని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్యులను నియమిస్తామని తెలిపారు. సంరక్షకులు లేని విద్యార్థులకు వేసవి సెలవుల్లో కూడా వసతి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ మెరిట్ సాధించిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా రూ.20 వేలు, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.15వేలు, రూ.10వేలు అందజేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శి ఎం. ఎం.నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి వి.ప్రసన్న వెంకటేష్, సంచాలకులు లావణ్య వేణి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి జి.గౌతమి, సంచాలకులు ఎస్.భార్గవి పాల్గొన్నారు.
నీట్‌లో ఉచిత కోచింగ్ సెంటర్లను పెంచుతాం మంత్రులు బాల వీరాంజనేయస్వామి, సంధ్యారాణి