
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
చివరి రోజు కనకాంబరాలు, గులాబీలతో అర్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలలో 9వ రోజైన సోమవారం అమ్మవారికి కనకాంబరాలు, గులాబీలతో విశేష అర్చన జరిగింది. సోమవారం మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతితో వసంత నవరాత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. సోమవారం ఉదయం ఆలయం ప్రాంగణంలోని పూజా మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆల య అర్చకులు గులాబీలు, కనకాంబరాలతో అర్చన నిర్వహించారు. అమ్మవారికి జరిగిన విశేష పుష్పార్చనలో పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్‌డీ ప్రసాద్, వేద పండితులు, అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించారు.