
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణాజిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన కేతినేని రత్నాకరరావు, లక్ష్మీ శమంతకమణి దంపతులు రూ.10 లక్షలు విరాళంగా సమర్పించారు. గురువారం ఉదయం స్వామివార్లను దర్శించుకున్న అనంతరం శాశ్వత నిత్యాన్నదాన పథకం కింద ఈ విరాళాన్ని ఆలయ ఏసీ ఎన్‌ఎస్ చక్రధరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. దాత కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి
చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ
పెనమలూరు: జాతీయ స్థాయిలో జరిగిన చిత్రలేఖన పోటీల్లో పోరంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పతకాలు సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మలినేని సుమలత గురువారం వివ రాలు తెలుపుతూ ఉగాది పండుగ సందర్భంగా నెల్లూరు అమీర్‌జాన్ అకాడమీ, విజయవాడ డ్రీమ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ, ఏపీ కల్చరల్ కమిషన్ సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎ.మణికంఠ, జె.చరణ్ కుమార్, పి.వరుణ్, కె.నాగమణి, వి.భార్గవి బంగారు పతకాలు, బి.సాత్విక్, ఎ.అఖిల, ఎన్.ఉమామహేశ్వరరావు వెండి పతకాలు సాధించారని తెలిపారు. పోరంకి పాఠశాలలో డ్రాయింగ్ మాస్ట్టారు పోస్టు ఖాళీగా ఉన్నందున విశ్రాంత డ్రాయింగ్ మాస్టారు ఆరేపల్లి అప్పారావు విజయవాడ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చారన్నారు.
పవిత్రతకు చిహ్నాలు ఆలయాలు
పామర్రు: పవిత్రతకు చిహ్నాలు మన ఆలయాలు అని వాటిని మనం అందరం కలిసి కాపాడుకోవాలని దేవదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డి.శాంతి అన్నారు. స్థానిక ఉండ్రపూడి–పోలవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో గురువారం ఆమె పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన దేవాలయాల పరిరక్షణకు దేవదాయ ధర్మదాయ శాఖ ఎంతో కృషి చేస్తోందని అన్నారు. జీర్ణోద్ధరణలో ఉన్న ఆలయాలను గుర్తించి వాటి అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. తొలుత ఆలయానికి వచ్చిన ఏసీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎల్.సత్యవతి, ఆలయ అర్చకులు అగ్నిహోత్రం రామాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
