
వయోవృద్ధులకు చక్రాల కుర్చీలు అందజేస్తున్న డీఆర్వో వెంకటరమణ తదితరులు
చిలకలపూడి(మచిలీపట్నం):దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకటరమణ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన దివ్యాంగులకు, వయో వృద్ధులకు అవసరమైన ఉపకరణాలను ఆదివారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ దేశంలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారని, 2024 నాటికి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్ 1న రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఉమేష్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి అభ్యర్థన మేరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2021లో దివ్యాంగులు, వయోవృద్ధులకు అవసరమైన ఉపకరణాలు అందజేయడానికి గుర్తింపు శిబిరాలు నిర్వహించారని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన రాష్ట్రీయ వయోశ్రీ యోజన ద్వారా ఆయన పుట్టినరోజున సీనియర్ సిటిజన్లకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేసేందుకు నిర్ణయించారని చెప్పారు. దీనికి శిబిరాలు నిర్వహించి 253 మంది వయోవృద్ధులకు రూ. 15.50 లక్షల విలువైన పరికరాలను సెప్టెంబరు 17న ఇవ్వాలని నిర్ణయించామని, కార్యక్రమం వాయిదా పడటంతో ఈ రోజు అందిస్తున్నామన్నారు. సీనియర్ సిటిజన్లకు వినికిడి పరికరాలు, చేతి కర్రలు, కళ్లద్దాలు, చక్రాల కుర్చీలు తదితరాలను పంపిణీ చేశారని చెప్పారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి.కామరాజు, ఆర్టిఫిషియల్ లిమ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి చంద్రకాంత్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
డీఆర్వో వెంకటరమణ