
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హైదరా బాద్‌కు చెందిన కడియాల బాలశేఖర్, శ్రీలక్ష్మి దంపతులు బంగారు, వెండి వస్తువులను ఆదివారం సమర్పించుకున్నారు. స్వామివార్లను దర్శించుకున్న అనంతరం రూ. 4.87 లక్షల విలువైన రెండు బంగారు హారాలు, రూ. 48,500 విలువైన రెండు వెండి ప్లేట్లను ఆలయ ఏసీ ఎన్‌ఎస్ చక్రధరరావుకు అందజేశారు. దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు. సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణాలో 11.4 మి.మీ. సగటు వర్షపాతం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఆదివారం 11.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బాపులపాడు మండలంలో 68.4, అత్యల్పంగా చల్లపల్లి మండలంలో 1.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కంకిపాడు మండలంలో 49.4 మిల్లీమీటర్లు, పెనమలూరు 47.4, ఉంగుటూరు 18.6, గన్నవరం 14.6, నందివాడ 12.4, ఉయ్యూరు 10.6, గుడివాడ 10.4, మొవ్వ 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మచిలీపట్నం మండలం 8.6 మిల్లీమీటర్లు, మోపిదేవి 8.2, పెదపారుపూడి 7.4, అవనిగడ్డ 6.0, తోట్ల వల్లూరు 2.4, గూడూరు 2.0, ఘంటసాల 1.8, పామర్రు 1.6, గుడ్లవల్లేరు, పెడన మండలాల్లో 1.4 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. బంటుమిల్లి, కోడూరు, కృత్తివెన్ను, నాగాయలంక, పమిడిముక్కలలో వర్షం కురవలేదు.
అమరుల త్యాగాలు
స్మరించుకోవాలి
మూలపాడు(ఇబ్రహీంపట్నం): ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అమర వీరులను స్మరించుకోవాలని, వారి త్యాగాలు మరువలేనివని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్‌పవార్ అన్నారు. నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా మూలపాడు వీరాంజనేయ కాలనీలో ఆమె ఆదివారం పర్యటించారు. భరతమాత చిత్రపటం వద్ద నివాళులర్పించారు. స్థానిక అంకమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు సిద్ధం చేసిన మట్టిని బిందెలో స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి సేకరిస్తున్న మట్టిని ఢిల్లీలో నిర్మిస్తున్న అమరవీరుల స్మారక స్తూపంలో వినియోగిస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జిల్లా ఇన్‌చార్జ్ నరసింహారావు, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు రేగళ్ల రఘునాఽథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ఏస్పా’కు నూతన కార్యవర్గం
పెనమలూరు: ఆక్యుపంక్చర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ (ఏస్పా) నూతన కార్యవర్గం ఎంపికైంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులో ఆదివారం అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ మాకాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏస్పా జాతీయ కార్యవర్గ సమావేశం ఇండియన్ ఓం కార్యాలయంలో జరిగింది. మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆక్యుపంక్చర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేరును మార్చుతూ ఆక్యుపంక్చర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్‌గా పేరు మార్చామన్నారు. జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ ఆలవాల రవి, కార్యదర్శిగా డాక్టర్ మాకాల సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా ఆర్య రాజకుమారి, డాక్టర్ అనిల్, జాయింట్ సెక్రటరీగా గాండ్ల పుష్పలత, ఇండ్లే కృష్ణ, శెట్టిపల్లి చిన్నఅప్పారావు, పిట్టల సుమలత, కోశాధికారిగా వెలగపూడి శ్రీదేవి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌లో విశిష్ట సేవలు అందించిన పలువురిని ఘనంగా సన్మానించారు.


