
బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్ వెంకటేష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఆర్థోపెడ్డిక్ విభాగాధిపతి డాక్టర్ డి.వెంకటేశ్వరరావు (వెంకటేష్) గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ అడిషనల్ డైరెక్టర్ హోదాలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ బి.సౌభాగ్య లక్ష్మిని రాజమండ్రి వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆమె స్థానంలో డాక్టర్ వెంకటేష్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. విధుల నుంచి రిలీవైన డాక్టర్ సౌభాగ్యలక్ష్మి నుంచి డాక్టర్ వెంకటేష్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గుంటూరు వైద్య కళాశాలలో 1989లో ఎంబీబీఎస్, 1993 ఆర్థోపెడిక్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. అనంతరం కేరళ, ముంబాయ్, తమిళనాడులో కొంతకాలం పనిచేశారు. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో 1998లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రభుత్వ సర్వీసులో చేరిన ఆయన 2012లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, 2017లో ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి పొంది, అప్పటి నుంచి ఆర్థోపెడిక్ విభాగాధిపతిగా కొనసాగుతున్నారు. ఇక్కడ పనిచేస్తూనే ప్రభుత్వ అనుమతితో 2004లో యూకే వెళ్లి ఆర్థోపెడిక్‌లో సూపర్ స్పెషాలిటీ కోర్సు (ఎంసీహెచ్) చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాస్పత్రిలోనూ జరగని విధంగా ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో 50కిపైగా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. కోవిడ్ సమయంలో డెప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ వెంకటేష్ సమర్థవంతంగా సేవలు అందించారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతి రోగికీ సత్వర వైద్యం అందించడమే లక్ష్యమని డాక్టర్ వెంకటేష్ తెలిపారు. ఈ విష యంలో వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టంచేశారు.