
గన్నవరం రూరల్: శరీర దానంపై ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనం ఎందరో దాతలకు ప్రేరణ ఇచ్చిందని మండలంలోని చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల(పిసిమ్స్) యాజమాన్యం పేర్కొంది. ఆ కథనం స్ఫూర్తితో ఎంతో మంది దాతలు మరణానంతరం తమ దేహాలను మెడికల్ కళాశాల వైద్య పరిశోధనలకు దానం చేసేందుకు ముందుకొస్తున్నా రని కళాశాల అనాటమీ డిపార్టుమెంట్ హెచ్‌ఓడీ డాక్టర్ ఎం.స్వాతి పూర్ణిమ గురువారం తెలిపారు. మరణానంతరం శరీరాన్ని దానం చేస్తున్న దాతల స్ఫూర్తిని వివరిస్తూ మే 24వ తేదీన ‘పరోపకారార్థం ఇదం శరీరం’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆ కథనం చదివిన ఎంతో మంది ఫోన్‌ల ద్వారా తమ శరీరాలను మరణానంతరం దానం చేసేందుకు పేర్ల నమోదుకు ముందుకొస్తున్నారని స్వాతి పూర్ణిమ తెలిపారు. ఫేస్‌బుక్ ద్వారానూ పలువురు సంప్రదించారని, రిజిస్ట్రేషన్ ఫారాలను వాట్సాప్ ద్వారా పంపాలని మరి కొందరు కోరా రని పేర్కొన్నారు. భవిష్యత్ కాలంలో వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం మరణానంతరం దేహాలను మెడికల్ కళాశాలకు ఇచ్చేందుకు ముందుకొచ్చేలా దాతల్లో స్ఫూర్తినింపిన ‘సాక్షి’కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మరణానంతరం శరీరదానానికి ముందుకొస్తున్న దాతలు పిసిమ్స్ అనాటమీ డిపార్టుమెంట్‌కు ఫోన్‌చేసి వివరాల సేకరణ ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన సిద్ధార్థ మెడికల్ కళాశాల యాజమాన్యం