మచిలీపట్నంటౌన్: నగరంలోని సర్వజన ఆస్పత్రిలో ప్రక్షాళనకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం చేసేందుకు రూ.10 వేల లంచం ఇవ్వాలని మృతుడి బంధువులను వైద్యుడి అటెండర్ బుధవారం డిమాండ్ చేసిన నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశాలతో బందరు ఆర్డీఓ ఐ.కిషోర్ గురువారం విచారణ నిర్వహించారు. ఆర్‌ఎంఓగా పనిచేస్తున్న పి.రామచంద్రరావు తనకు అనారోగ్య సమస్య ఉండటంతో ఈ విధుల నుంచి తనను తప్పించాలని ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ కె.విజయకుమారికి గురువారం లేఖ ఇచ్చారు. దీంతో ఇన్‌చార్జ్ ఆర్‌ఎంఓగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్.నిరంజనకుమార్‌ను, ఇన్‌చార్జ్ అసిస్టెంట్ ఆర్‌ఎంఓగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.మురళీకృష్ణను నియమిస్తూ విజయకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టుమార్టం వివాదంలో ఉన్న వైద్యుడు కృష్ణాంజనేయులు మూడు రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఆర్‌ఎంఓగా పని చేస్తున్న రామచంద్రరావు ఈ ఘటనలో అధికారులకు వివరణ ఇచ్చి తన సాధారణ విధులతో పాటు అదనపు బాధ్యతగా ఉన్న ఆర్‌ఎంఓ పోస్టును చేయలేనని పేర్కొన్నారు. విచారణలో అటెండర్లు శ్రీనివాసరావు, నాగరాజు తాము డబ్బులు అడగలేదని చెబుతున్నారని ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ విజయకుమారి తెలిపారు. ఈ ఘటనలో భాగమైన ఉద్యోగులపై డీఎంఏకు నివేదిక పంపుతామని, అనంతరం వచ్చిన ఆదేశాల మేరకు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు
ఆస్పత్రిలో ఏ విభాగంలో అయినా అవినీతికి పాల్పడితే సంబంధిత ఉద్యోగిపై కఠిన చర్యలు తప్పవని ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ విజయ కుమారి హెచ్చరించారు. తన చాంబర్‌లో హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ వైద్యులు, శానిటేషన్, సెక్యూరిటీ విభాగ సూపర్‌వైజర్లతో ఆమె గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోగులకు సేవలు అందించే సమయంలో ఎలాంటి అవినీతికి పాల్పడినా చర్యలు తప్పవన్నారు. పోస్టుమార్టంలను సంబంధిత వైద్యులు సకా లంలో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
చర్యలకు ఉపక్రమించిన ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ విజయకుమారి తనను బాధ్యతల నుంచి తప్పించాలని కోరిన ఆర్‌ఎంఓ ఇన్‌చార్జి ఆర్‌ఎంఓగా డాక్టర్ నిరంజనకుమార్ నియామకం