
వయసుతో సంబంధం లేకుండా బ్రెయిన్ స్ట్రోక్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారు బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యేవారు. ఇప్పుడు రెండు పదుల వయస్సులోనే బ్రెయిన్‌స్ట్రోక్‌నకు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు స్ట్రోక్‌కు గురై చికిత్సకోసం వస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల తొమ్మిదేళ్ల బాలుడు బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై ప్రభుత్వాస్పత్రిలో చేరడం గమనార్హం.
ముందస్తు సూచనల్లేకుండా..
ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా వచ్చేదే బ్రెయిన్ స్ట్రోక్. రక్త ప్రసరణలో అవరోధం కలగడం, నరాలు చిట్లడం ప్రధాన కారణాలు. మెదడుకు ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలు చిట్లి పోవడం, రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడటం వల్ల మెదడలోని ఆ భాగం కణ మరణానికి దారి తీసి స్ట్రోక్‌కు గురవుతారు.
కారణాలు ఇవే..
● సాధారణంగా 55 ఏళ్లకు పైన ఉన్న వారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
● యువత ఎక్కువగా స్ట్రోక్‌కు గురవడానికి కారణం ధూమపానం, మద్యం తాగడమేనని వైద్యులు చెబుతున్నారు.
● జీవన విధానంలో మార్పులు, మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉండటం, ఒబెసిటీ వారిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.
● మహిళల్లో కంటే పురుషులకు స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ.
● పెద్ద వయస్సు మహిళల్లో స్ట్రోక్ రావచ్చు.
● ఈస్ట్రోజెన్ కలిగి ఉన్న హార్మోన్ థెరపీలు, గర్భనిరోధక మాత్రలు వాడిన వారిలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
● గుండె జబ్బులు ఉన్న వారికి బ్రెయిన్‌స్ట్రోక్ రావచ్చు.
● అన్యూరిజం వంటి శరీర నిర్మాణ లోపాల(రక్తనాళాల గోడలు బలహీనమై ఉబ్బడం) వల్ల స్ట్రోక్ రావచ్చు.
● రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలైన వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ.
● పుట్టుకతోనే జన్యుపరమైన లోపాల కారణంగా రక్తం గడ్డకట్టే గుణం ఉన్న వారికి స్ట్రోక్ రావచ్చు.
లక్షణాలు ఇలా ఉంటాయి..
మాట్లాడటం, మాట అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, ముఖం వేలాడి పోవడం, చేతులు బలహీనపడటం, శరీరం సమతుల్యత కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, దృష్టిలో ఇబ్బంది, కళ్లు తిరగడం. ఈ లక్షణాలు గుర్తించిన నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి చేరుకోగలిగితే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
రెండు రకాలుగా..
బ్రెయిన్‌స్ట్రోక్ ఇస్కిమిక్, హెమరైజ్డ్ అనే రెండు రకాలుగా వస్తుంది. ధమనిలో అడ్డంకులు, మెదడు రక్తనాళం సన్నబడటం, అవరోధం ఏర్పడటం వల్ల ఇస్కిమిక్ స్ట్రోక్ వస్తుంది. కాగా 80 శాతం మంది ఈ రకం స్ట్రోక్‌కు గురవుతుంటారు. రక్తనాళం లోపలి నుంచి లీకేజీ, ధమని చిట్లడం వల్ల హెచరైజ్డ్ స్ట్రోక్ వస్తుంది. మెదడు రక్తస్రావం రక్తనాళాలను ప్రభావితం చేసే అనేక పరిస్థితుల ఫలితంగా వస్తుంది.
ఆ నాలుగు గంటలే కీలకం అంటున్న వైద్యులు లక్షణాలు గుర్తించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచన జీవనశైలి, ధూమపానం, మద్యం కారణమంటున్న నిపుణులు ఉమ్మడి కృష్ణాలో ఏటా ఆరు వేలకు పైగానే బ్రెయిన్ స్ట్రోక్ కేసులు
నాలుగు గంటల్లోపు రావాలి
బ్రెయిన్ స్ట్రోక్‌పై ప్రజల్లో అవగాహన పెరిగినా, చికిత్స పొందేందుకు సకాలంలో రావడం లేదు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారిలో స్ట్రోక్‌కు గురైన 24 గంటల దాటి కాలు, చేయి చచ్చుపడిన తర్వాతే వస్తున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కాహాల్ కారణంగా యువత స్ట్రోక్‌కు గురవుతున్నారు. వాటిని మానడం ద్వారా స్ట్రోక్ బారి నుంచి బయటపడవచ్చు. స్ట్రోక్‌తో వచ్చిన వారి పరిస్థితులకు ఆధారంగా చికిత్స అందిస్తాం. అవసరమైతే ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచుతాం. సివియర్‌స్ట్రోక్ వచ్చిన కోమాలోకి వెళ్లిన కొందరికి సర్జరీ కూడా అవసరం అవుతుంది. స్ట్రోక్ లక్షణాలు గుర్తించి నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి చేరుకోగలిగితే నష్ట తీవ్రతను తగ్గించవచ్చు. ప్రభుత్వాస్పత్రిలో ఆధునిక సేవలు అందుబాటలో ఉన్నాయి.
– దారా వెంకట రమణ,
జీజీహెచ్ న్యూరాలజీ విభాగాధిపతి

