
కృష్ణా పుష్కరాల సమయంలో పద్మావతి స్నానఘాట్ నిర్మాణ పనుల్లో కార్మికులు (ఫైల్)
పటమట(విజయవాడతూర్పు): కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థలో జరిగిన అవకతవకలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. పుష్కరాల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలకు సంబంధించి టీడీపీ హయాంలో ప్రారంభమైన ఈ విచారణ నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో నిలిచిపోయింది. ఇటీవల టీడీఆర్ బాండ్లు వ్యవహారంపై విచారణ చేపట్టిన ఏసీబీ తాజాగా కృష్ణా పుష్కరాల సమయంలో జరిగిన అక్రమాలపై దృష్టి సారించింది. వీఎంసీ ప్రజారోగ్యం, ఇంజినీరింగ్ విభాగాల పరిధిలో వివిధ పరికరాలు, సామగ్రి కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై విచారణను ముమ్మరం చేసింది.
ఏమి జరిగిందంటే..
2016 ఆగస్ట్‌లో జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా స్నాన ఘాట్లు, పుష్కర నగర్‌లు, యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లు, బ్లీచింగ్ పౌడరు, 18 రకాల పరికరాలు, సామగ్రి కొనుగోలుకు జనరల్ బడ్జెట్ నుంచి రూ.3.75 కోట్లను వీఎంసీ వెచ్చించింది. 2017 ఆగస్ట్‌లో మళ్లీ సామగ్రి కొనుగోలు చేసినట్లు స్థాయీ సంఘం ముందుకు బిల్లులు వచ్చాయి. కొనుగోలు చేయకుండానే బిల్లులు పెట్టడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. నాటి ప్రభుత్వ పెద్దలు ఈ స్కామ్‌లో భాగస్వాములు కావటం, వారికి కావాల్సిన వారికి టెండర్లు కట్టబె ట్టడం, పరికరాలు కొనుగోలు చేయకుండానే స్థాయీ సంఘం ముందుకు బిల్లులు రావటం వివాదాస్పదమయ్యాయి. ఈ అక్రమాలపై అప్పటి మేయర్ కోనేరు శ్రీధర్ తొలుత దృష్టి సారించారు. ఆ తరువాత అప్పటి ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో అక్రమాల వ్యవహారాన్ని విస్మరించారు. అయితే కార్పొరే షన్‌లో అప్పటి వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్, ప్రస్తుత ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండి నాగేంద్రపుణ్యశీల సారధ్యంలో పార్టీ కార్పొరే టర్లు కౌన్సిల్లో, కౌన్సిల్ బయటా టీడీపీ చేసిన అవకతవకలపై ఆధారాలతో తూర్పారబట్టారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన ఆందోళనకు స్పందించిన అప్పటి మునిసిపల్ కమిషనర్ జె.నివాస్ విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ అక్రమాలపై ఏసీబీ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.
రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనలోనూ..
కృష్ణాపుష్కరాల సమయంలో నగర వ్యాప్తంగా రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పనకు రూ.175 కోట్లు వెచ్చించారు. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో సీసీ రోడ్లపై రోడ్లు వేయటం, నాణ్యత లేకపోవడంతో అప్పట్లో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. పటమటలోని భద్రయ్యనగర్‌లోని రోడ్డు, అజిత్‌సింగ్‌నగర్‌లోని లూనాసెంటర్‌లో వేసిన సీసీ రోడ్డు, భవానీపురంలోని ఆశ్రమం రోడ్డు తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్ల నమూనాలను సేకరించారు. అయితే ఈ విచారణ కూడా ఆగిపోయింది.
కీలకంగా మారిన త్రిసభ్య కమిటీ నివేదిక
కృష్ణా పుష్కరాల సమయంలో జరిగిన అవకతవకలపై వైఎస్సార్ సీపీ, ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టడంతో వీఎంసీ యూసీడీ పీడీ సత్యనారాయణ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(వీఏఏస్) శ్రీధర్, లీగల్ సెల్ ఇన్‌చార్జి సి.వెంకటేశ్వరరావుతో కూడిన త్రిసభ్య కమిటీని అప్పటి మునిసిపల్ కమిషనర్ జె.నివాస్ ఏర్పాటు చేశారు. అక్రమాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. అప్పటి నివేదికను తమకు రెండువారాల్లో సమర్పించాలని ప్రస్తుత మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను ఏసీబీ అధికారులు తాజాగా కోరారు.
సిబ్బందిలో గుబులు
త్రిసభ్య కమిటీ నివేదికను ఇవ్వాలని ఏసీబీ అధికా రులు కోరడంతో వీఎంసీ ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగం క్షేత్రస్థాయి సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఏడేళ్లనాటి అంశం మళ్లీ వెలుగులోకి రావడంతో అప్పుడు ఫైళ్లు రూపొందించిన గుమస్తాలు, సీనియర్ అసిస్టెంట్లను ఏసీబీ అధికారులు ఎక్కడ విచారణకు పిలుస్తారోనన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కొంత మంది లాగ్‌లీవ్ పెట్టారని సమాచారం.
త్రిసభ్య కమిటీ నివేదికను ఏసీబీ అడిగిన విషయమై మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్‌పుండ్కర్‌ను వివరాణ కోరగా.. ఏసీబీ నివేదిక అడిగింది వాస్తవమేనని అన్నారు. కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి, ఆ నివేదిక ఎక్కడ ఉందో గుర్తించి అందజేస్తామని తెలిపారు.
కృష్ణా పుష్కర సామగ్రి కొనుగోళ్లలో అక్రమాలు నాడు అవకతవకలకు పాల్పడ్డ టీడీపీ అప్పట్లో విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ ఆ కమిటీ రిపోర్ట్ కోరిన ఏసీబీ అధికారులు రెండు వారాల్లో సమర్పించాలని మునిసిపల్ కమిషనర్‌కు సూచన
కఠిన చర్యలు తీసుకోవాలి
పుష్కరాల కొనుగోళ్లకు సంబంధించి జరిగిన అక్రమాలపై అప్పట్లో కౌన్సిల్‌ల్లో ప్రశ్నిస్తే మమ్మల్ని పదేపదే సస్పెండ్ చేశారు. అటు కౌన్సిల్లోనూ ఇటు బయట మేము చేపట్టిన ఆందో ళనల ఫలితంగా విచారణకు త్రిసభ్య కమిటీని వేశారు. ఈ వ్యవహారంలో నాటి టీడీపీ పెద్దలు నేరుగా జోక్యం చేసుకుని విచారణను నీరు గార్చారు. అక్రమాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించి దోషులను ప్రజల ముందు ఉంచ టమే కాకుండా కఠినంగా శిక్షించాలి.
– బండి నాగేంద్ర పుణ్యశీల, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్