మొదటి 'ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా' కార్డు గ్రహీత మన హైదరాబాదీ! 

Details About Overseas Citizenship Of India - Sakshi

Overseas citizenship Of India concept and Its benefits ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడగరా నీ తల్లి భూమి భారతిని అన్నారు రాయప్రోలు సుబ్బారావు. తాతలు, ముత్తాతల కాలంలో విదేశాల్లో స్థిరపబడినా ఇంకా తమలోని భారతీయను మరిచిపోలేని వారు ఎందరో ఉ‍న్నారు. ఇందులో కొందరు మరోసారి తమ మాతృనేల మీద మమకారంతో ఇక్కడి పౌరసత్వాన్ని ఆశించారు. అయితే అందుకు రాజ్యాంగ చిక్కులు ఎదురయ్యాయి... ఏళ్లు గడిచాయి.. చివరకు ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) తో ప్రవాస భారతీయులకు ఊరట లభించింది. ద్వంద పౌరసత్వ డిమాండ్‌కి మధ్యేమార్గంగా కేంద్రం తెచ్చిన ఓసీఐని అందుకున్న మొదటి ప్రవాసుడు మన హైదరాబాదీ. ఇంకా ఈ పథకం గురించి మరిన్ని వివరాలు మీ కోసం.. 

డ్యూయల్ సిటిజెన్‌ షిప్‌ (ద్వంద్వ పౌరసత్వం) కోసం.. ప్రవాస భారతీయులు (ఇండియన్ డయసపోరా) చాలా కాలంగా కోరుతున్నారు. మరోవైపు  భారత రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించడం లేదు. దీంతో మధ్యేమార్గంగా భారత  పౌరసత్వ (సవరణ) చట్టం, 2005 ద్వారా ఓసీఐ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. కొన్ని నిబంధనలకు లోబడి  ఓసీఐ కలిగిన వారు భారత పౌరులతో సమానంగా అనేక హక్కులను  పొందవచ్చు. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేపథ్యం ఉన్న వారికి మాత్రం అర్హత లేక పోవడం గమనార్హం.

అంతకు ముందు
పదహారేళ్ల ఏళ్ల క్రితం 2006 జనవరిలో హైదరాబాద్ లో జరిగిన ప్రవాసి భారతీయ దివస్ సదస్సులో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (విదేశీ పౌరసత్వం కలిగిన భారత ప్రవాసీ) అనే పథకాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత కాలంలో అప్పటి వరకు జారీ చేస్తూ వచ్చిన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పిఐఓ) కార్డులను ఓసీఐ కార్డులుగా విలీనం చేస్తున్నట్లు సెప్టెంబర్ 2014న భారత ప్రభుత్వం ప్రకటించింది.  

తొలి కార్డు హైదరాబాదీకే
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఓవర్సీస్‌ సిటిజన్‌ షిప్‌ ఆఫ్‌ ఇండియా తొలి కార్డు ఓ హైదరాబాదీకి జారీ అయ్యింది.  2016 జనవరి 7న జరిగిన ఓ కార్యక్రమంలో  అప్పటి భారత ప్రధాని  డాక్టర్‌ మన్మోహన్ సింగ్ మొట్టమొదటి  ఓసీఐ కార్డును హైదరాబాద్ కు చెందిన ఇండియన్-అమెరికన్ ఇఫ్తేఖార్ షరీఫ్ అందజేశారు. 

ఎవరీ ఇఫ్తేఖార్‌ షరీఫ్‌
అమెరికా పౌరసత్వం కలిగిన భారత సంతతి వ్యక్తి అయిన ఇఫ్తేఖార్ షరీఫ్ ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకులు. అమెరికాలోని చికాగో నివాసిస్తున్నారు.  ఆయన పూర్వీకులు  హైదరాబాద్ లోని శంషాబాద్‌లో ఉండేవారు.  ఆయన బంధువులు ఇక్కడే జీవిస్తున్నారు. 

ఓసీఐతో ప్రయోజనాలు
ఓవర్సీస్ సిటిజన్‌ ఆఫ్ ఇండియా - ఓసీఐ (భారతీయ విదేశీ పౌరుడు) అంటే.. విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అని అర్థం. ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఉన్న వ్యక్తులకు వారి జీవిత భాగస్వాములకు భారతదేశంలో నిరవధికంగా నివసించడానికి, పని చేయడానికి అనుమతి ఉంటుంది. 'ఓసీఐ' కార్డుదారులు భారతదేశాన్ని ఎన్నిసార్లు అయినా సందర్శించడానికి జీవితకాల వీసా పొందుతారు. ఆర్థిక, విద్యా రంగాలలో ఎన్నారైలతో సమాన అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ భూములు, తోటలు కొనడంపై మాత్రం నిషేధం. 

వర్తించనవి
ఓసీఐ కార్డు కలిగి ఉండటం వలన  భారత పౌరసత్వ హోదా రాదు. భారతీయ ఎన్నికలలో ఓటు వేసే హక్కు రాదు. కేవలం నివాసం, పని చేసుకునే హక్కులు ఉంటాయి.  కాగా చివరి సారిగా ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా పథకంలో కొన్ని మార్పులను 2021 ఏప్రిల్‌లో చేపట్టారు.

ఇవీ అర్హతలు
ఓసీఐ కార్డు పొందాలంటే దరఖాస్తుదారులు గాని, వారి తల్లిదండ్రులు గాని, తాతలు గాని, ముత్తాతలు గాని భారతీయులు అనే రుజువులను సమర్పించాలి. అనగా... తాము భారతీయ పూర్వీకుల పిల్లలు, మనుమలు, ముని మనుమలు / మనవరాళ్లు అని నిరూపించుకోవాలి. విదేశీ మిలిటరీలో పనిచేసిన వారు అనర్హులు. ఈ విషయంలో ఇజ్రాయిల్ వారికి మినహాయింపు ఇచ్చారు. 19వ శతాబ్దంలో భారతదేశం నుండి సురినామ్‌కి  వెళ్లి డచ్ జాతీయత పొందినవారికి సంబంధించి ఆరు తరాల వరకు అర్హులుగా పేర్కొన్నారు.

ఓసీఐ పొందడం ఇలా
ఓసీఐ కార్డు కోసం ociservices.gov.in లో ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఓసీఐ పొందేందుకు అర్హతలు, పాటించాల్సిన నియమాలతో పాటు మరిన్ని వివరాలు https://www.mea.gov.in/overseas-citizenship-of-india-scheme.htm పోర్టల్‌లో లభిస్తాయి.

చదవండి:ఫినో బ్యాంకు.. అంతర్జాతీయ మనీ ట్రాన్స్‌ఫర్‌ సేవలు

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top