ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని శంకర్ భవన్ పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించిన కలెక్టర్.. వారి అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని, డాన్స్, సింగింగ్, ఇండోర్ గేమ్స్ వంటి వాటిలో మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు పలు అంశాలపై ప్రశ్నలు వేశారు. సమాధానాలు ఇచ్చిన చిన్నారులకు కలెక్టర్ బహుమతులు, చాక్లెట్లు అందజేశారు. కలెక్టర్ వెంట డీఈవో పి అశోక్, ఎంఈవోలు సాయిరెడ్డి, అరవింద్‌గౌడ్, హెచ్‌ఎం సాయన్న తదితరులు ఉన్నారు.
రుద్రూర్: తమకు అవసరం లేకున్నా నానో యూరియాను ఎరువులతోపాటు బలవంతంగా అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పొతంగల్ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్డొలిలో ఎరువుల విక్రయ కేంద్రానికి రైతులు మంగళవారం తాళం వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గతంలో తీసుకున్న నానో యూరియా లిక్విడ్ ఇంకా మిగిలి ఉండగానే మళ్లీ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మూడు సంచుల ఎరువులు తీసుకుంటే ఒక లిక్విడ్ బాటిల్ తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధన విధించడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో అదనపు భారం మోపడం తగదన్నారు. వ్యవసాయాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలోకి హిజ్రాల రాకను నిషేధిస్తూ గ్రామాభివృద్ధి కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల సమయంలో హిజ్రాలు వచ్చి వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వారి అంగీకారం మేరకు హిజ్రాల ఆగడాలను శాశ్వతంగా అరికట్టేందుకు గ్రామాభివృద్ధి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హిజ్రాలను గ్రామంలోకి రానివ్వొద్దని తీర్మానించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని సుభా
ష్‌నగర్‌లో ఉన్న బాలసదనం నుంచి ముగ్గురు బాలికలు మంగళవారం అదృశ్యమయ్యారు. వార్డెన్‌కు చెప్పకుండా బాలికలు బయటికి వెళ్లిపోయారు. సదనం ఇన్‌చార్జి సౌందర్య మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇద్దరు బాలికలను గుర్తించి బాలసదనంలో అప్పగించారు. మరో తొమ్మిదేళ్ల బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


