‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యా వారోత్సవాలకు ఎంతో ప్రాధాన్యత చేకూరింది. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో బడి బాగుకు కృషి చేయనున్నారు. ప్రతిరోజూ వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఖలీల్‌వాడి: విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు లక్ష్యంగా నేటి (సోమవారం) నుంచి ఈనెల 17వ తేదీ వరకు విద్యాశాఖ విద్యా వారోత్సవాలను నిర్వహించనుంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించింది.
సర్పంచ్‌లతో చర్చలు
13వ తేదీన నియోజకవర్గ స్థాయిలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, బడిబాట తదితర అంశాలపై చర్చించనున్నారు. బడిబాటలో భాగంగా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి నోట్‌ప్యాడ్, పెన్, బ్యాగ్‌లతో కూడిన కిట్, భోజన వసతి ఏర్పాటు చేయనున్నారు.
ప్రతిభావంతులకు బహుమతులు
17వ తేదీన విద్యా విజయోత్సవం నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, క్రీడల్లో జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.10వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. ‘విద్యలో అత్యుత్తమ ప్రతిభను వేడుకగా జరుపుకోవడం’ అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
శిథిలావస్థ భవనాలపై ప్రత్యేక చర్యలు
జిల్లాలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను గుర్తించనున్నారు. వాటిని తక్షణమే సీజ్ చేసి విద్యా కార్యకలాపాలకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోనున్నారు. నిబంధనల ప్రకారం వాటిని కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటారు.
బడిబాటతో చైతన్యం
14వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గ్రామాలు, వార్డుల్లో ర్యాలీలు చేపట్టి విద్యపై అవగాహన కల్పించనున్నారు. తల్లిదండ్రులతో సమావేశాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నారు. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు వంట పోటీలు నిర్వహిస్తారు. ఉత్తమ హాజరు ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి చేయనున్నారు.
గ్రంథాలయాల ప్రాముఖ్యతపై..
15వ తేదీన గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ‘గ్రంథాలయాలు–జ్ఞాన హదయం’ అనే నినాదంతో పుస్తక ప్రదర్శనలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా డిజిటల్ కేటలాగ్ ప్రారంభం, ఉత్తమ పాఠకులకు గుర్తింపు కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ప్రాథమిక 769
ప్రాథమికోన్నత 132
ఉన్నత 255
మొత్తం విద్యార్థులు సుమారు లక్షా 50వేలు
నేటి నుంచి విద్యా వారోత్సవాలు
జిల్లాలో పాఠశాలలు
17వ తేదీ వరకు వివిధ
కార్యక్రమాల నిర్వహణ
విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
విద్యార్థుల ప్రతిభావికాసం,
పాఠశాలల అభివృద్ధే లక్ష్యం


