ఆ ఐదుగురు ఎవరో.. | - | Sakshi
Sakshi News home page

ఆ ఐదుగురు ఎవరో..

May 11 2026 7:20 AM | Updated on May 11 2026 7:20 AM

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కో ఆప్షన్‌ పదవులు దక్కే ఆ ఐదుగురు ఎవరనే అంశంపై జోరుగా చర్చసాగుతోంది. నగరంలోని 60 డివిజన్ల నుంచి 59 మంది దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సిల్‌ సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. కాగా ఐదు పదవులను అధికార పార్టీ కాంగ్రెస్‌, ఎంఐఎం కలిసి దక్కించుకుంటాయని రాజకీయ వర్గాల్లో టాక్‌.

కౌన్సిల్‌లో బలాబలాలు

కౌన్సిల్‌లో 60 మంది కార్పొరేటర్లు, ఐదుగురు ఎక్స్‌ అఫిషియో మెంబర్లు ఓటుహక్కును కలిగి ఉన్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎం, ఒక బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌తో పాటు ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిపి 34 సంఖ్యాబలం ఉంది. అదేవిధంగా బీజేపీకి 28 మంది కార్పొరేటర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు కలిపి 31 బలం ఉంది.

కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం?

కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు, ఎ మ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అవసరమైతే ఈ సమావేశంలోనే కా ర్పొరేటర్లకు అవగాహన నిమిత్తం మాక్‌పోల్‌ జరపనున్నట్లు తెలిసింది. 59 మంది దరఖాస్తులు చేసుకోవడంతో.. ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అధికార కాంగ్రెస్‌, ఎంఐఎంకు తలనొప్పిగా మారింది. అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.

ఎన్నిక ప్రక్రియ సాగనుందిలా..

మొత్తం ఐదు కో ఆప్షన్‌ పదవులకు గాను, రెండు మైనార్టీ (మెన్‌, ఉమెన్‌ ఒక్కోటి), మూడు జనరల్‌ కేటగిరిలో (రెండు మెన్‌, ఒకటి ఉమెన్‌) ఎన్నుకోవాల్సి ఉంటుంది. గతంలో కౌన్సిల్‌ మెంబర్‌, ఎన్జీవో, రిటైర్డ్‌ ఎంప్లాయీ అయి ఉండాలి. మెజార్టీ సభ్యుల ఓట్లు వచ్చిన వారు కో ఆప్షన్‌ సభ్యుడు/సభ్యురాలిగా ఎన్నికవుతారు. అయితే ఐదు పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్‌, ఎంఐఎం మధ్య స్పష్టమైన ఒప్పందం కుదిరినట్లు చర్చ జరుగుతోంది. ఎంఐఎం 2, కాంగ్రెస్‌ 3 పదవులు పంచుకున్నట్లు సమాచారం.

నేడు నిజామాబాద్‌ మున్సిపల్‌

కార్పొరేషన్‌ ‘కో ఆప్షన్‌’ ఎన్నిక

దరఖాస్తులు 59.. అదృష్టం

ఎవరిని వరించేనో..

అధికార పార్టీకి తలనొప్పిగా

మారిన ఎంపిక

కార్పొరేటర్లతో టీపీసీసీ అధ్యక్షుడు

మహేశ్‌కుమార్‌గౌడ్‌ సమావేశం?

Advertisement
 
Advertisement
Advertisement