నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాల్సిన ‘మీ సేవ’ సెంటర్లు అవినీతి అక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. డబ్బులకు అలవాటు పడి సర్టిఫికెట్‌ల జారీ ప్రక్రియను పూర్తిగా అవినీతి మయం చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొన్ని సెంటర్లలో వెలుగు చూసిన ఘటనలో అధికారులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఏసీబీ అధికారులు సైతం ఇటీవల జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌లో ఉన్న మీ సేవ కేంద్రంపై దాడి చేసి తనిఖీలు చేయగా అనేక అక్రమాలకు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. సెంటర్లను పర్యవేక్షించాల్సిన అధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో ఉన్నారనే విమర్శలున్నాయి. అధికారులకు, మీ సేవ సెంటర్ల మధ్య మీ సేవ సెంటర్ల సంఘం నాయకుడు ఒకరు మధ్యవర్తిత్వం వహిస్తూ డబ్బులు చేతులు మారుస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లాలో వెలుగు చూసిన ఘటనలు కొన్ని..
● జిల్లా కేంద్రంలోని ఆరోటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ ప్రాంతంలోని మీసేవ సెంటర్ నిర్వాహకులు మైనర్ అమ్మాయిని మేజర్‌గా చూపుతూ ఆధార్ కార్డులో మార్పులు చేయగా కేసు నమోదైంది. తప్పుడు సర్టిఫికెట్‌ను చూపి సదరు అమ్మాయిని ఓ ఖాజీకి ఇచ్చి వివాహం చేసినట్లు తెలిసింది. ఇదే మీ సేవ కేంద్రంలో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, భూముల వ్యవహారాలకు సంబంధించి సర్టిఫికెట్ల జారీలో రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం కాకుండా రెండింతల డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
● నిజామాబాద్ రూరల్ మండలంలోని పాల్దా గ్రామంలో ఓ మీసేవ సెంటర్ నిర్వాకుడు బీహార్ రాష్ట్రానికి చెందిన కొందరి ఆధార్ కార్డుల్లో మార్పులు చేస్తూ స్థానికంగా ఉంటున్నట్లు తప్పుడు అడ్రస్‌ను సృష్టించాడు. ఒకరు ఆర్మీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయగా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో వ్యవహారం వెలుగలోకి రాగా, ప్రస్తుతం విచారణ సాగుతోంది.
● నిజామాబాద్ నగరంలోని రైల్వే గేట్ సమీపంలోని మీ సెంటర్ నిర్వాకుడు మున్సిపల్ అధికారులకు దగ్గరగా ఉంటూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. కులం, ఆదాయ, జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయించడంలో ఇతగాడు ఆరితేరాడు. ఎటువంటి లోపాలున్నా సరిచేస్తామంటూ వేలా రూపాయలు వసూలు చేస్తున్నాడు. దరఖాస్తుదారులు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే లలితా మహాల్ థియేటర్ సమీపంలోని మీ సేవ సెంటర్‌కు వెళ్లాలని సూచిస్తుండడం గమనార్హం.
● శివాజీనగర్‌లోని ఓ మీ సేవ సెంటర్‌పై ఏసీబీ అధికారులు దాడులు చేసి సర్టిఫికెట్ల జారీకి డబ్బులు వసూలు చేయడంతోపాటు అధికారులకూ పంపుతున్నట్లు గుర్తించారు. ఈ సెంటర్‌లో అనేక అక్రమాలు ఉన్నట్లు తెలిసింది.
డబ్బుందా..? సర్టిఫికెట్ ఏదైనా ఇట్టే తెచ్చేస్తామంటున్నారు కొన్ని మీసేవ కేంద్రాల నిర్వాహకులు. దరఖాస్తుదారుల అవసరం, అమాయకత్వమే ఆసరగా దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఆన్‌లైన్‌లోనే ఒక్క ‘క్లిక్’తో పూడ్చిపెడుతున్నారు. అవినీతి నిరోధకశాఖ మీ సేవ కేంద్రాలపై నిఘా సారించి తనిఖీలు నిర్వహించిన ఘటనలే ‘మీ సేవలో మాయ’ ఏ స్థాయిలో ఉందో చెబుతున్నాయి.
సర్టిఫికెట్ ఏదైనా డబ్బులు ఇస్తే చాలు..
అధికారులతో సెంటర్ల
నిర్వాహకుల కుమ్మక్కు
ఏసీబీ నిఘా సారించినా
కనిపించని మార్పు
ఇప్పటికే పలు సెంటర్లపై చర్యలు


