● పింఛన్ అందించేందుకు కృషి
● మత్స్య ప్రగతి, ప్రణాళిక సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
డొంకేశ్వర్(ఆర్మూర్): గంగపుత్రుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి అన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి మత్స్య ప్రగతి, ప్రణాళిక సమావేశం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కాంగ్రెస్ పార్టీ ఫిషరీష్ జిల్లా అధ్యక్షుడు బోర్గాం శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. మత్స్యకారులకు అనువుగా జిల్లాలో పుష్కలంగా జల వనరులు, చెరువులు ఉన్నాయని ఇక్కడి నుండే చేప పిల్లల పెంపకం చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానన్నారు. మత్స్యకారులకే కాకుండా ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కింద రూ.5 లక్షలు ప్రమాదవశాత్తు చనిపోతే ఇస్తున్నామని, అందుకు సంబంధించి ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లోనే నిధులు కూడా కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. మత్స్యకారులకు పింఛన్ అందించేలా ప్రభుత్వాన్ని కోరతానన్నారు. అర్సపల్లిలో మత్స్యకారుల కోసం కేటాయించిన భూమి గతంలో కబ్జాకు గురైందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని కాపాడామని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. అర్సపల్లిలో మత్స్య శాఖ స్థలం కబ్జాకు గురి కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయించి, సీసీ కెమెరాలు పెట్టిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన మత్స్య కార్మిక సంఘాల సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. మత్స్య శాఖ ఏడీ ఆంజనేయస్వామి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయారెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి, నాయకులు ఉమ్మాజీ నరేశ్, కిరణ్, అగ్గు భోజన్న తదితరులు పాల్గొన్నారు.


