రాంచంద్రపల్లి వద్ద చైన్ స్నాచింగ్
నిందితులను పట్టుకుంటాం..
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్‌లలో ఢిల్లీ ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కొంతమంది పాత నేరస్తులతో కలిసి వరుస గొలుసు చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ ముఠాలో ముంబైకి చెందిన పలువురు యువకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైళ్ల ద్వారా జిల్లాకు వస్తున్న ముఠా సభ్యులు మొదట పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి బైక్ చోరీకి పాల్పడతారు. ఆ బైక్‌ల ద్వారానే గొలుసు చోరీలు చేస్తున్నారు. గతేడాది ఆగస్టు వరకు చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా నమోదు కాగా, పోలీసుల విస్తృత తనిఖీలతో తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర విపరీతంగా పెరగడంతో ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన దొంగలు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
మాటల్లో పెట్టి..
నగరంలోని గాయత్రీనగర్‌లో ఇటీవల ఉదయం 5 గంటలకు బైక్‌పై వచ్చిన దుండగులు మహిళ మెడలో నుంచి గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. మహిళ ప్రతిఘటించడం, సమీపంలో ఉన్న కుక్క దుండగులపై దాడికి యత్నించడంతో సగం చైన్ మాత్రమే లాక్కెళ్లారు. అనంతరం మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బ ఏరియాలో మరో మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. అయితే, ఈ ఘటనలకు పాల్పడింది ఢిల్లీకి చెందిన దొంగలుగా పోలీసులు భావిస్తున్నారు. ఇందులో ఇద్దరు ముంబైకి చెందిన యువకులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీరు చోరీ చేసిన బైక్‌లపై వచ్చి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడతారు. అనంతరం బైక్‌లను వదిలేసి రైళ్లలో ముంబై, ఢిల్లీకి పారిపోతున్నారు. వీరు నిజామాబాద్‌తోపాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గత డిసెంబర్ నెలలో కూడా మహారాష్ట్రకు చెందిన ముఠా వినాయకనగర్‌లోని ఓ మహిళను అడ్రస్ అడిగి రెండున్నర తులాల బంగారాన్ని లాక్కెళ్లరు. కసాబ్‌గల్లీలో మరో మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ చేశారు. ఆ తర్వాత నాలుగు రోజులకే సుభాష్‌నగర్‌లోని పూలు తెంపుతున్న వృద్ధురాలి మెడలోని రెండు తులాల బంగారు చైన్ లాక్కెళ్లారు.
చైన్‌స్నాచింగ్‌ల వివరాలు
సంవత్సరం చోరీలు ఛేదించినవి
2022 26 13
2023 40 18
2024 37 7
2025 17 13
2026 9 01
మాక్లూర్: జిల్లా కేంద్రంలోని గూపన్‌పల్లికి చెందిన భోజమ్మ తన భర్తతో కలిసి శుక్రవారం బైక్‌పై తొర్లికొండలో జరిగిన శుభకార్యానికి వె ళ్లారు. సాయంత్రం 6 గంటల సమయంలో తిరి గి వస్తుండగా ఆలూర్ మండలం రాంచంద్రపల్లి కమాన్ వద్ద వెనకాలే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు భోజమ్మ మెడలోని తులంన్నర పుస్తెలతాడును అపహరించారు. బాధితురాలి ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
నగరంలో వరుస చైన్ స్నాచింగ్‌లు
ఢిల్లీ ముఠా పనిగా పోలీసుల అనుమానం
పాత నేరస్తులతో కలిసి చోరీలు
ప్రత్యేక బృందాలతో గాలింపు
చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఢిల్లీ ముఠాగా అనుమానం ఉంది. హైదరాబాద్‌లోని మేడ్చల్, పేట్ బషీర్‌బాగ్ ప్రాంతాల్లోనూ వీరు చోరికి పాల్పడ్డారు. అక్కడి పోలీసులతో కలిసి విచారణ చేస్తున్నం. అతి త్వరలోనే పట్టుకుంటాం. మహిళలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
– ప్రకాశ్, ఏసీపీ నిజామాబాద్ డివిజన్


