ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
● వడ్ల కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం
● కమ్మర్‌పల్లి, భీమ్‌గల్‌లో
కొనుగోలు కేంద్రాల పరిశీలన
కమ్మర్‌పల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లోనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిందని, దీంతో రైతులు కన్నీరు పెడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్, భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్, చేంగల్ గ్రామా ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. 125 లారీలకు సరిపడా ధాన్యం నిల్వ, కొనుగోళ్లు మాత్రం నత్తనడకన జరుగుతున్నాయన్నారు. వర్షాలు పడుతున్నప్పటికీ ప్రభుత్వం లారీలు, హమాలీలు, టార్పాలిన్ల వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
మిల్లర్ల ‘తరుగు’ దోపిడీపై ఆగ్రహం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తా తీ సుకోవాల్సి ఉండగా, రైస్‌మిల్లర్లు 43 నుంచి 44 కి లోల వరకు అడుగుతున్నారని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. క్వింటాల్‌కు సుమారు 10 కిలోల వరకు ‘తరుగు’ పేరుతో ధా న్యం దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే..
క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నేరుగా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫోన్ ద్వారా వివరించారు. వెంటనే డీఎం, డీసీవో, డీఎస్‌వో అధికారులు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు.
క్షేత్రస్థాయి పరిస్థితులు వేరు..
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని, సీఎం వెంటనే ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ‘తమ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజూ కొనుగోళ్లపై సమీక్ష ఉండేది. ఇప్పుడు మాత్రం రైతులను పూర్తిగా గాలికొదిలేశారు’ అని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘తాలు తీస్తే తోలు తీస్తా’ అన్న సీఎం.. ఇప్పుడు రైతుల వద్ద నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నా మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు తన వంతు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రేగుంట దేవేందర్, నాయకులు బద్దం చిన్నారెడ్డి, బైకానీ మహేశ్, భూమేశ్వర్ తదితరులు ఉన్నారు.


