● ఎగిరిపోయిన టర్పాలిన్లు, కల్లాల్లోకి చేరిన నీరు
● తడిసి ముద్దయిన ఆరబోసిన ధాన్యం, తూకం వేసిన బస్తాలు
● దిక్కుతోచని స్థితిలో రైతాంగం
మోర్తాడ్ మండలం గాండ్లపేట్‌లో తడిసిన ధాన్యాన్ని దిగాలుగా చూస్తున్న రైతు
తడిసిన ధాన్యం, పసుపు కొమ్ములు
ధాన్యం కుప్పల వద్ద నీటిని తొలగిస్తున్న రైతు
గాలివాన బీభత్సం
డొంకేశ్వర్(ఆర్మూర్) : అకాల వర్షంతో జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం సాయంత్రం మేఘావృతమై గాలివాన బీభత్సం సృష్టించింది. కల్లాల్లో పంట కుప్పలపై కప్పి ఉంచిన టర్పాలిన్లు సైతం బల మైన గాలులకు ఎగిరిపోయాయి. ఆరబోసిన పంటలను కాపాడుకోడానికి రైతులు పరుగులు తీశారు. ఇటు భారీ వర్షానికి కల్లాల్లోకి నీరు చేరి చెరువులను తలపించాయి. టర్పాలిన్లు లేని రైతులు కళ్ల ముందే ధాన్యం తడిసి కొట్టుకుపోతుంటే ఏమి చేయలేక నిస్సాహాయ స్థితిలో ఉండిపోయారు. తూకం వేసి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన వడ్ల బస్తాలు సైతం తడవడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. డొంకేశ్వర్ మండలంలో 2 సెంటీ మీర్లకు పైగా వర్షం కుసింది. అత్యధికంగా భీమ్‌గల్‌లో నాలుగు సెంటీ మీటర్లు, కమ్మర్‌పల్లిలో మూడు, డిచ్‌పల్లిలో రెండు సెంటీ మీటర్లు నమోదైంది. ఆలూరు, బాల్కొండ, మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, మోర్తాడ్, సిరికొండ, చందూర్, వర్ని, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లో కూడా ఈదురు గాలివానకు పంటలు తడిశాయి. కోతకు వచ్చిన మామిడి కూడా నేలరాలింది.
కల్లాల నుంచి ధాన్యం కదలకపోవడంతో..
కోసిన పంటంతా ప్రస్తుతం కల్లాల్లోనే ఉంది. కొనుగోళ్లు వేగవంతంగా జరగకపోవడంతో కల్లాలు ఖాళీ కావడం లేదు. లారీల కొరత కూడా ప్రధాన కారణం. దీంతో కురిసిన అకాల వర్షానికి పెద్ద మొత్తంలో పంట తడిసిపోయింది. దీంతో రైతులు మళ్లీ ధాన్యం ఆరబోసేందుకు శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ధాన్యం రంగు మారుతుందని ఆందోళన చెందుతున్నారు. మక్క కొనుగోళ్లు కూడా నెమ్మదిగా జరగడంతో పంటను కాపాడుకోవడానికి రైతులు తంటాలు పడుతున్నారు. వడ్లు తడిసి కొట్టుకుపోవడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని, ఎలాంటి మెలిక లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
వర్షానికి తడిసిన వడ్ల బస్తాలు


