పేదలకు మేలు.. రైతులకు దన్ను | - | Sakshi
Sakshi News home page

పేదలకు మేలు.. రైతులకు దన్ను

May 8 2026 1:07 PM | Updated on May 8 2026 1:07 PM

రేషన్‌ ద్వారా మరిన్ని నిత్యావసరాలు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : వ్యవసాయ జిల్లాగా పేరున్న నిజామాబాద్‌లో పంటల మార్పిడికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం దక్కే అవకాశాలు నెలకొంటున్నాయి. జూన్‌ 2 నుంచి రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాల ద్వారా జొన్న, మొక్కజొన్నలను తక్కువ ధరకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తద్వారా పేదలకు తక్కువ ధరకే పౌష్టికాహారం, రైతులకు దళారుల సమస్య లేకుండా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో జిల్లాలోని జొన్న, మొక్కజొన్న రైతులకు ఉపయోగం కానుంది. ఽఇప్పటివరకు ధాన్యం మాదిరిగా పూర్తిస్థాయిలో మొక్కజొన్న, జొన్నలను కొనుగోలు చేయకపోతుండడంతో దళారులు, మధ్యవర్తులే ఎక్కువగా లాభపడుతున్నారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మేలు కలుగుతుండడంతో పాటు పంటల మార్పిడికి మార్గం సుగమమవుతుంది. ఈ పంటలను ప్రభుత్వమే పూర్తిగా సేకరించడంతో రైతులకు మద్దతు దక్కడంతో పాటు, మరోవైపు రేషన్‌ డీలర్లకు సైతం ఉపయోగం కలుగనుంది. కేవలం బియ్యం నుంచి వచ్చే కమీషన్‌తో మాత్రమే డీలర్లు సరిపెట్టుకుంటున్నారు. నిత్యావసరాల సంఖ్య పెంచితే డీలర్లకు సైతం కమీషన్‌ పెరగనుంది. మంత్రివర్గ ఉప సంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

● జిల్లాలో రైతులు వానాకాలం, యాసంగి సీజన్లలో వరి తర్వాత జొన్నలు, మక్క పంటలనే అధికంగా సాగు చేస్తున్నారు. ప్రతి సీజన్‌లో 40 వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగవుతుండగా, ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. అలాగే జొన్నల సాగు కూడా క్రమంగా పెరుగుతుండగా ఎకరానికి 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈ పంటలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో సేకరించడం లేదు. దీంతో కొందరు రైతులు మాత్రమే మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. మిగిలిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దళారుల ప్రమేయానికి చెక్‌ పెట్టి మొత్తం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రేషన్‌ దుకాణాల ద్వారా ప్రజలకు తక్కువ ధరకు అందించాలని నిర్ణయించింది. విద్యార్థులకు సైతం బలవర్ధకమైన ఆహారం అదించేందుకు జొన్న, మక్కలను ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు, గురుకులాలకు సరఫరా చేయాలని ఆలోచన చేస్తోంది. పౌల్ట్రీ రైతులకు కూడా మార్కెట్‌ ధర కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ఆలోచన చేస్తోంది. ఈ ప్రక్రియ అమలైతే జిల్లాలోని జొన్న, మొక్కజొన్న రైతులకు మరింత మేలు జరుగుతుంది. పంటలను అమ్ముకునేందుకు ఇబ్బందులు తప్పుతాయి. నేరుగా రైతులకే మద్ధతు ధర లభిస్తుంది. తద్వారా జిల్లాలో ఈ రెండు పంటలను సాగు చేయడానికి మరింత మంది రైతులు ముందుకు వచ్చేందుకు అవకాశముంది.

రేషన్‌ దుకాణాల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలు సరఫరా చేస్తే రైతులకు, పేదలకు, విద్యార్థులకు, రేషన్‌ డీలర్లకు సైతం మే లు కలుగుతుంది. మధ్య దళారులు లేకుండా చేయవచ్చు. ఇదే రీతిలో రా నున్న రోజుల్లో మరిన్ని నిత్యావసర వస్తువులను రేషన్‌ దుకాణాల ద్వారా ప్రజలకు అందించేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

– గడుగు గంగాధర్‌, వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు

జూన్‌ 2 నుంచి రేషన్‌ దుకాణాల

ద్వారా తక్కువ ధరకు జొన్న,

మొక్కజొన్న సరఫరా!

వ్యవసాయ జిల్లా కావడంతో పంటల మార్పిడికి మరింత ప్రోత్సాహం

Advertisement
 
Advertisement
Advertisement