● నిర్లక్ష్యం వహిస్తే సిబ్బంది
వేతనాలు నిలిపేస్తాం
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
సుభాష్‌నగర్ : ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) సన్నాహక ప్రక్రియ ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈ ప్ర క్రియ పట్ల నిర్లక్ష్యం వహిస్తే వేతనాలు నిలిపేస్తా మని హెచ్చరించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ అమలు తీరుపై కలెక్టర్ గురువారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో ఏఈఆర్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లతో సమీక్షించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీ గా ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ అమలును పరిశీలిస్తూ, పనితీరులో వెనుకంజలో ఉన్న ఏఈఆర్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లను కారణాలు అడిగి తెలుసుకున్నారు. అర్బన్‌లో మ్యాపింగ్ ప్రక్రియ మందకొడిగా సాగడం వల్ల జిల్లా సగటుపై ప్రభావం చూపుతోందని కలెక్టర్ అన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా బీఎల్‌వోలతో మ్యాపింగ్‌ను పక్కాగా జరిపించాలని, రోజువారీగా నిశితంగా పర్యవేక్షించా లని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనితీరు సక్రమంగా లేని ఇద్దరు ఆర్‌పీలకు షోకాజ్ నోటీసులు అందించి విధుల నుంచి తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తన అనుమతి లేకుండా బీఎల్‌వోల మార్పులు, చేర్పులు చేయకూడదని సూచించారు.
ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక సమగ్ర సవరణను ఎన్నికల సంఘం చేపట్టిందన్నారు. రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకునేలా చూడాలని, మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి కోసం వారి సహకారం తీసుకోవాలని సూచించారు. డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిపోయిన, రెండు ఓట్లు ఉన్నవాళ్ల ఓట్లు మాత్రమే తొలగిస్తారని పేర్కొన్నారు. ఎవరూ అపోహలకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ తరువాత ఎవరైనా ఓటుహక్కు రాని వారు ఉంటే ఆక్షేపణ చేయవచ్చని అన్నారు. సమీక్షలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


