ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

కొనుగోలు కేంద్రాల నుంచి

బస్తాలను తరలించాలి

ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు

నిజామాబాద్‌ అర్బన్‌: ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు జిల్లా యంత్రాంగానికి సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల సంస్థ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రతో కలిసి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం ధాన్యం సేకరణ అంశంపై మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాబోయే ఐదు రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సేకరించిన ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలను తక్షణమే కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌ మిల్లులు, గోదాములకు తరలించాలని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తగిన సంఖ్యలో టార్పాలినన్‌లు అందుబాటులో ఉంచాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా కొనుగోలు కేంద్రాల బాధ్యులు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. అకాల వర్షాల సమయంలో పీపీసీల వద్ద 24 గంటలు పర్యవేక్షణ కొనసాగించాలని, అత్యవసర తరలింపుల కోసం తగిన సిబ్బంది, వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజనూ కొనేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. వీసీలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, డీఆర్డీవో సాయన్న, డీసీవో శ్రీనివాస్‌, డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, సివిల్‌ సప్లయీస్‌ డీఎం ప్రవీణ్‌, డీసీవో శ్రీనివాస్‌, మార్కెటింగ్‌ శాఖ అధికారి గంగవ్వ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement