● 3 వేల గడ్డి కట్టలు దగ్ధం
మాక్లూర్ : మండలంలోని వేణుకిసాన్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గాలిబ్‌నగర్ వద్ద గల శ్రీమన్నారాయణ గోశాలలో సోమవారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పశువుల మేత కోసం ఉంచిన సుమారు 3000 గడ్డి కట్టలు దగ్ధమయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే గోశాలలో ఉన్న గడ్డి కట్టలన్నీ కాలిపోయాయి. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ గోశాల నిర్వాహకుడు మాట్లాడుతూ రైతులు తమకు తోచిన విధంగా గడ్డి కట్టలు దానం చేయాలని కోరారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్ గ్రామంలో వరి కోస్తున్న హార్వెస్టర్‌కు విద్యుత్ తీగలు తగలడంతో దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. హార్వెస్టర్‌కు విద్యుత్ తీగలు తగలడంతో గమనించిన డ్రైవర్ చాకచక్యంతో వెంటనే మిషన్ పైనుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, విద్యుత్ తీగలు చేతికందేలా వేలాడుతున్నాయని గతంలో విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వేలాడుతున్న తీగలను వెంటనే సరి చేయాలని కోరుతున్నారు.
సిరికొండ: మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఒక బాబుపై జరిగిన దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. సోమవారం ఇద్దరు హిజ్రాలు ఆటోలో వచ్చి తన బాబును గోడకేసి కొట్టినట్లు తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మోపాల్: మండలంలోని మంచిప్పలో ఇటీవల జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై జాడె సుస్మిత సోమవారం తెలిపారు. కోవూరి పద్మ తన ఇంట్లో చోరీ జరిగిందని గత నెల 26న ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన అలకుంట శంకర్‌ను అనుమానితుడిగా భావించి అదుపులోకి తీసుకొని విచారించారు. తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు, పల్సర్ బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు.


