మోర్తాడ్(బాల్కొండ): ప్రభుత్వరంగ సంస్థల కన్నా ప్రైవేటు కంపెనీలు విత్తనోత్పత్తిలో ముందంజలో ఉన్నాయి. యాసంగి సీజన్‌లో వరి సీడ్ రకాన్ని రైతులతో సాగు చేయించిన పలు కంపెనీలు ఎలాంటి తరుగు లేకుండానే తీసుకెళ్తున్నాయి. అయితే, ప్రభు త్వ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలను తూకం వేసేందుకు కొర్రీలు పెట్టడంతోపాటు సన్నరకాల కొనుగోళ్లలో తరుగు తప్పటం లేదు. ఈ పరిస్థితు ల్లో సీడ్ రకం సాగు చేసిన రైతులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ధాన్యం తరలిపోతుండటం విశేషం.
10 వేల ఎకరాల్లో సాగు..
మోర్తాడ్, కమ్మర్‌పల్లి, భీమ్‌గల్, వేల్పూర్, ఏర్గట్ల, మెండోరా, ముప్కాల్, బాల్కొండ తదితర మండలాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లను సీడ్ కంపెనీల ద్వారానే రైతులు సాగు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు కఠినంగా ఉండటం, టొకెన్‌ల జారీలో తీవ్ర జాప్యంతో సమయం వృథా అవుతుందని భావించి ముందుగానే అనేక మంది రైతులు సీడ్ కంపెనీలతో ఒప్పందాలను చేసుకున్నారు. దొడ్డు రకం సాగు చేసిన రైతులకు ఎకరానికి 35–38 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, సన్నరకంలో మాత్రం 28 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తోంది. దీంతో దొడ్డు రకం విత్తనోత్పత్తికి రైతులు మొగ్గు చూపుతున్నారు. కాగా, కొనుగోళ్లు కేంద్రాల్లో ఏ గ్రేడ్ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2,389 ధర ఉండగా, విత్తనోత్పత్తి కోసం సాగు చేసిన ధాన్యానికి రూ.61 అదనంగా అంటే రూ.2,450 సీడ్ కంపెనీలు చెల్లిస్తున్నాయి. ధాన్యం తరలించిన 15 రోజులలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని సీడ్ కంపెనీల యజమానులు హామీ ఇచ్చారు. ఇప్పటికే మొదట్లో తరలించిన ధాన్యానికి సంబంధించి డబ్బులు జమ చేయగా మిగతా వారికి గడువు ముగిసేలోపు జమ చేస్తామని చెప్తున్నారు.
సీడ్ కంపెనీల కోసం
దొడ్డు రకం వరి సాగు
తరుగు లేకుండా తీసుకెళ్తున్న కంపెనీలు
ఏ గ్రేడ్ ధాన్యం ధర కన్నా రూ.61 అదనం
బైబ్యాక్ ఒప్పందంతో సాగు పూర్తి చేసిన రైతన్నలు
ఏడేళ్లుగా సాగు చేస్తున్నాం..
ఏడేళ్లుగా యాసంగిలో సీడ్ రకం సాగు చేస్తున్నాం. నాతోపాటు మా గ్రామంలో 30 శాతం మంది రైతు లు సీడ్ రకం సాగుచేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో విత్తనోత్పత్తి దిశగా రైతులను ప్రోత్సహించాలి.
– మామిడి రాజు, గాండ్లపేట్


