తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్ర శేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు మొత్తం 5,016 మందికి గాను 4,789 మంది హాజరుకాగా 227 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. మధ్యాహ్నం రెండో సెమిస్టర్ రెగ్యులర్, మూడో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 6,894 మందికి 6,507 మంది హాజరు కాగా 387 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రంలో సోమవారం నుంచి పసుపు విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు శాస్త్రవేత్త జి. విద్య ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రంలో దుగ్గిరాల ఎరుపు, సేలం, రాజాపురి తదితర రకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒక్కో రైతుకు 100 కిలోల వరకు విత్తనాలు అందజేస్తామన్నారు. క్వింటాలుకు రూ. 3000 చెల్లించాలని అన్నారు. పసుపు విత్తనం అవసరం ఉన్న రైతులు పట్టా పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్‌తోపాటు సంచులు తీసుకొని రావాలని సూచించారు.
లిఫ్ట్‌లో చిక్కుకున్న చిన్నారులు
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని జీవన్‌రెడ్డి మాల్ లిఫ్ట్‌లో ఇద్దరు చిన్నారులు చిక్కుకుపోయిన ఘ టన కలకలం రేపింది. షాపింగ్ కోసం తల్లిదండ్రులతోపాటు వచ్చిన పిల్లలు సరదాగా లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ పైకి వెళ్తుండగా సాంకేతిక లోపంతో మధ్యలోనే ఆగిపోవడంతో చిన్నారులు చిక్కుకుపోయారు. సుమారు గంటపాటు లిఫ్ట్‌లోనే ఉండిపోవడంతో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మాల్ యాజమాన్యం వెంటనే స్పందించి లిఫ్ట్‌ను తెరిచి చిన్నారులను సురక్షితంగా బయటకు తీయడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
నిందితుడి అరెస్ట్
ఎల్లారెడ్డి: బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని ఎల్లారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని న్యూ ఆబాదీ కాలనీకి చెందిన మహమ్మద్ అహ్మద్ సులభంగా డబ్బు సంపాదించాలని కొంతకాలంగా బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. నకిలీ తాళాలతో బైక్‌లను చోరీ చేసి వాటి నెంబర్ ప్లేట్లు మార్చి అమ్ముకుంటున్నాడు. గత నెల 26న ఎల్లారెడ్డి సంతలో పార్కింగ్ చేసిన ఒక టీవీఎస్ మోపెడ్ వాహనాన్ని దొంగిలించాడు. ఈ కేసు విషయంలో విచారణ చేసిన పోలీసులు స్టేషన్ పరిధిలో జరిగిన పలు బైక్ చోరీలకు నిందితుడిగా అహ్మద్‌ను గుర్తించారు. విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం ఉదయం నిందితుడిని అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. చోరీ చేసిన ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజిరెడ్డి తెలిపారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై మహేశ్, ఎస్సై–2 సుబ్రహ్మణ్య చారి, ఏఎస్సై దేవాగౌడ్‌ను అభినందించారు.


