రేపు బోధన్‌లో కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తి ర్యాలీ
బోధన్: దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావించి వందేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణ కేంద్రంలో కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తి ర్యాలీ నిర్వహించనున్నట్టు ఆ పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి జీ నడ్పి భూమయ్య తెలిపారు. గురువారం పట్టణంలోని ఎల్‌బీఎస్ నగర్ కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో జిల్లా, డివిజన్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు స్థానిక శక్కర్‌నగర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ కొత్త బస్టాండ్ మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో ఎర్రజెండా పేద ప్రజలకు అండగా నిలిచిందని, ఎన్నో హక్కులు సాధించిందన్నారు. పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ర్యాలీకి తరలి రావాలని పిలుపునిచ్చారు. నాయకులు ఎల్ చిన్న పర్వయ్య, పీరోళ్ల పోశెట్టి, గౌతం కుమార్, సుధాకర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


