మోర్తాడ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ!
మోర్తాడ్: మోర్తాడ్‌లో గతంలో సర్పంచ్ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థులకు ఇక్కడి ఓటర్లు భారీ మెజార్టీతో విజయం కట్టబెట్టారు. ఈక్రమంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారోనని ఉత్కంఠ నెలకొంది. నేడు జరుగనున్న పోలింగ్‌లో ఓటర్లు గతంలో లాగే ఏకపక్ష తీర్పును ఇస్తారా లేక భిన్నమైన తీర్పును ఇస్తారోననే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది.
2006లో జరిగిన ఎన్నికల్లో గోపిడి సత్యనారాయణపై అజీస్ వెయ్యికి పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పట్లో ఇక్కడ లభించిన మెజార్టీ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. 2013 ఎన్నికల్లో అజీస్‌పై దడివె నవీన్ 2,300 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించిన సర్పంచ్‌గా రికార్డు నెలకొల్పారు. 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి పాపాయి నర్సుపై భోగ ధరణి 1033 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ జిల్లాలో రెండో స్థానంలో నిలచింది. ఇప్పుడు సాగుతున్న పోరులో నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుతో గిర్మాజి గోపి, బీఆర్‌ఎస్ మద్దతుతో భోగ ఆనంద్, మాజీ సర్పంచ్ అజీస్, బీజేపీ మద్దతుతో గట్ల సురేష్ పోటీలో నిలిచారు. అజీస్ బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా ఆ పార్టీ నాయకులు మాత్రం ఆనంద్‌కే మద్దతుగా నిలిచారు. చతుర్ముక పోటీలో విజయం సాధించే అభ్యర్థి గతంలో లాగా భారీ మెజార్టీ దక్కించుకుంటారా లేక స్వల్ప ఓట్లతోనే విజయం సాధిస్తారా అనే అంశంపై గ్రామస్తులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మోర్తాడ్‌లో ప్రస్తుతం 9వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈక్రమంలో ఓటర్లు గతంలో లాగా ఏకపక్ష తీర్పు ఇస్తారో లేక భిన్నమైన ఫలితాలు వెల్లడిస్తారో మరికొన్ని గంటల్లో తేలనుంది.
గత ఎన్నికల్లో భారీ మెజార్టీ
సాధించిన విజేతలు
జిల్లాలో మొదటి, రెండో స్థానాల్లో సర్పంచ్‌ల మెజార్టీ
ఈసారి పోటీ తీవ్రం కావడంతో
మెజార్టీపై ఆసక్తికరమైన చర్చ


