ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ
వర్ని (మోస్రా): మండలంలోని గోవూరు శివారులో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. నాలుగు ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి, అందులోని కాపర్ కాయిల్స్‌ను దొంగలించారు. చోరీకి గురైనం కాయిల్స్ విలువ సుమారు రూ.4లక్షల వరకు ఉంటుందని లైన్ ఇన్‌స్పెక్టర్ స్వామి వెల్లడించారు. విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించి పంచనామా నిర్వహించారు.
రెంజల్(బోధన్): ఎల్‌జీ(లక్కీ జనరల్) యాప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు పిట్ల మధు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇటీవల ‘ఎల్‌జీ’ మోసాలు, బాధితులపై ‘సాక్షి’ పత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలపై ఎస్‌బీ(స్పెషల్ బ్రాంచ్) పోలీసులు ఆరా తీశారు. బాధితుల వివరాలను సేకరించి జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు. అలాగే స్థాని క న్యాయవాది స్పందించి, బాధితులతో మాట్లాడి ఇటీవల స్థానిక ఠా ణా లో ఫిర్యాదు చేయించారు. ఈమేరకు ఎస్‌బీ పోలీసులు అందించిన వివరాలతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
నిజాంసాగర్(జుక్కల్): బైండోవర్ ఉల్లంఘన చట్టం కింద నిందితుడికి మంగళవారం నిజాంసాగర్ తహసీల్దార్ బిక్షపతి రూ. 5వేల జరిమానా విధించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. వివరాలు ఇలా.. మండలంలోని మాగి గ్రామ శివారులోని బేడీల మైసమ్మ దాబాలో ఎటువంటి అనుమతుల లేకుండా మద్యం సిట్టింగ్ నిర్వహిస్తుండటంతో ఫిబ్రవరిలో పోలీసులు దాడులు చేశారు. దాబా నిర్వాహకుడు చింతకింది శేఖర్‌ను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. మళ్లీ ఈనెల 10న సదరు దాబాలో మద్యం సిట్టింగ్ నడుపుతుండటంతో ఎస్సై దాడులు చేసి, శేఖర్‌పై కేసు నమోదు చేశారు. కేసును తహసీల్దార్ భిక్షపతి దృష్టికి తీసుకువెళ్లగా బైండోవర్ ఉల్లంఘన కింద నిందితుడికి రూ. 5వేల జరిమానా విధించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.
మోపాల్: మండలంలోని తాడెం (తానాకుర్దు) గ్రామంలో కల్లులో కలిపేందుకు తీసుకెళ్తున్న 580 గ్రాముల అల్ప్రాజోలంను పట్టుకున్నట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. తాడెం గ్రామంలో కల్లులో కలిపేందుకు మత్తుపదార్థాలు తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో మంగళవారం ప్రవీణ్ గౌడ్, సాగర్ గౌడ్ అల్ప్రాజోలం తీసుకుని తాడెం వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 580 గ్రాముల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్సై తెలిపారు.
కామారెడ్డి రూరల్: పాస్‌పోర్టు విచారణలో నిర్లక్ష్యం వహించిన భిక్కనూర్ ఏఎస్సై నర్సయ్య, రామారెడ్డి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకట్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు ఇన్‌చార్జి డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్సై నర్సయ్య గతంలో డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేసినప్పుడు ఒక పాస్‌పోర్టు దరఖాస్తుపై విచారణ చేపట్టాల్సిన బాధ్యతలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. వెంకట్‌రెడ్డి కూడా డీఎస్‌బీలో పని చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తుల పాస్‌పోర్టు దరఖాస్తు విచారణలో బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించారు. ఈ విషయం ఎస్పీ రాజేష్ చంద్ర దృష్టికి రావడంతో విచారణ జరిపిన ఎస్పీ తన నివేదికను ఇన్‌చార్జి డీఐజీకీ పంపించారు. ఆయన నిర్లక్ష్యాన్ని సీరియస్‌గా పరిగణించి ఇద్దరిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


