డిచ్‌పల్లి: ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటెయినర్ ఢీకొన్న ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందగా మరో డ్రైవర్ స్వల్పగాయాల పాలైయ్యాడు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని నాగ్‌పూర్ గేట్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డిచ్‌పల్లి ఎస్సై మహ్మద్ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. బెంగుళూరు నుంచి మోటారు బైక్‌ల లోడ్‌తో మధ్యప్రదేశ్‌కు కంటెయినర్ వెళ్తోంది. డిచ్‌పల్లి నాగ్‌పూర్ గేటు వంతెన మూలమలుపు వద్ద మోటారు బైక్‌ల లోడ్‌తో ఉన్న పెద్ద ట్రక్కు క్యాబిన్ ఎడమ వైపు అద్దం పగిలిపోవడంతో డ్రైవర్ రోడ్డుపక్కన నిలిపి ఉంచారు. అదే సమయంలో బెంగుళూరు నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న కంటెయినర్ డ్రైవర్ నిద్రమత్తులో నిలిపి ఉన్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో కంటెయినర్ అదుపుతప్పి డివైడర్ పై నుంచి అవతలి పక్కకు దూసుకెళ్లి పక్కనున్న బారికేడ్‌ను ఢీకొని నిలిచిపోయింది. కంటెయినర్‌లో ఇద్దరు డ్రైవర్లు ఉండగా ఆ సమయంలో ఓంప్రకాష్ నడుపుతున్నాడు. ప్రమాదం జరిగినప్పుడు క్యాబిన్ ఎడమవైపు డోర్ ధ్వంసం కావడంతో అటువైపు కూర్చున్న మరో డ్రైవర్ దేవేంద్రసింగ్(45) అందులోంచి కిందపడగా కంటెయినర్ టైర్లు అతడిపై నుంచి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. ఓంప్రకాశ్, దేవేంద్రసింగ్ ఇద్దరు అన్నదమ్ములు.. రాజస్తాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన వారు. ఓంప్రకాశ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్మూర్ వైపు నుంచి కామారెడ్డి వైపు వెళ్లే రోడ్డుపై వాహనాలు రాకపోవడంతో మరో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. లేదంటే డివైడర్ పై నుంచి అటువైపు దూసుకెళ్లిన కంటెయినర్ కు ఢీకొని మరో ప్రమాదం జరిగి ఉండేది. సమాచారం అందుకున్న ఎస్సై షరీఫ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దేవేంద్రసింగ్ మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గాయపడిన డ్రైవర్ ఓంప్రకాశ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఆగి ఉన్న ట్రక్కులోని వారికి ఏమీ కాలేదు. ట్రక్కు వెనకభాగంలో కంటెయినర్ ఢీకొట్టడంతో అందులో ఉన్న కొన్ని మోటారు బైకులు దెబ్బతిన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కంటెయినర్