
మీరేం చేస్తున్నారు?
● ‘విధులకు డుమ్మా.. రిజిస్టర్‌లో హాజరు..’పై మండిపాటు
● జిల్లా వైద్యాధికారులపై
డీహెచ్ ఫైర్
● అక్రమార్కులపై చర్యలు
తీసుకోవాలని ఆదేశాలు
నిజామాబాద్ నాగారం: ‘విధులకు డుమ్మా.. రిజిస్టర్‌లో హాజరు..’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులు స్పందించారు. జిల్లాలో మెడికల్ ఆఫీసర్ల పనితీరు, కిందిస్థాయి ఉద్యోగులు విధులకు రాకపోయినా హాజరు వేయడంతో జిల్లా అధికారిపై మండిపడ్డారు. పర్యవేక్షించాల్సిన డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ఎంహెచ్‌వోలు ఏం చేస్తున్నారని ఆరా తీశారు. జిల్లాలోని ఆయా మెడికల్ ఆఫీసర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలు, సబ్ సెంటర్లపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటే తప్పిదాలు జరగకుండా ఉండేవని మండిపడ్డారు. సంబంధిత డిప్యూటీ డీఎంహెచ్‌వోలు పక్కాగా పరిశీలిస్తే ఇలాంటి ఘటనలు జరగవన్నారు. మెడికల్ ఆఫీసర్ల పనితీరు, కిందిస్థాయి సిబ్బంది ఏవిధంగా విధులు నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా మానిటరింగ్ చేయాలని డీహెచ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో రాజశ్రీకి డీహెచ్ ఆదేశాలు జారీ చేశారు.