
అటకెక్కిన విజిలెన్స్ విచారణ
● బాల్కొండ నియోజకవర్గంలో
కొట్టుకుపోయిన చెక్‌డ్యాంలు
● విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేసిన
కాంగ్రెస్ నేతలు
మోర్తాడ్(బాల్కొండ): రైతాంగానికి మేలు చేయాలనే సంకల్పంతో చేపట్టిన చెక్‌డ్యాంల నిర్మాణాల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడంతో వరదల తాకిడికి చెక్‌డ్యాంలు కొట్టుకపోయి రైతులకు తీవ్రనష్టాన్ని చేకూర్చాయి. బాల్కొండ నియోజకవర్గంలోని పెద్దవాగు, కప్పల వాగులలో 12 చోట్ల చెక్‌డ్యాంలను నిర్మించగా, ఐదు చెక్‌డ్యాంలు వరద తాకిడిని తట్టుకోలేక కుంగిపోయాయి. కట్టలు తెగి పంట పొలాల్లోకి నీరు చేరింది. ఫలితంగా లక్షలాది రూపాయల ప్రజాధనం నీటి పాలైంది.
చెక్‌డ్యాంల పరిస్థితి ఇలా..
● వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ, జాన్కంపేట్‌ల మధ్య 2019లో రూ.4.78 కోట్ల వ్యయంతో చెక్‌డ్యాం నిర్మించారు. 3 మీటర్ల ఎత్తులో నిర్మించాలని నిర్ణయించగా అంచనా వ్యయం పెంచుకోవడానికి 4.1 మీటర్ల ఎత్తులో నిర్మించారు. వరద తాకిడిని అంచనా వేయకపోవడంతో మట్టి కట్టలు కూలిపోయి పంట పొలాలను నీరు ముంచెత్తింది.
● మోర్తాడ్ మండలం సుంకెట్ వద్ద రూ.9.38 కోట్లతో చెక్‌డ్యాం పనులు సకాలంలో పూర్తికాలేదు. దీంతో వర్షాకాలంలోనూ పనులు కొనసాగించాలని చూశారు. రెండుసార్లు చెక్‌డ్యాం కొట్టుకపోయి పంట పొలాలు నీటమునగడంతోపాటు ఇసుక మేటలు వేయడంతో ఒక్కో రైతు ఎకరానికి రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది.
● మోర్తాడ్ మండలం పాలెం– ధర్మోరాల మధ్య పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం మట్టికట్ట కూలిపోయి పంటలు నీట మునిగాయి. ఇదే చెక్‌డ్యాం వద్ద కాజ్‌వే నిర్మించారు. నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడంతో మూడుసార్లు కాజ్‌వే కుంగిపోవడం, కూలిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
● ఏర్గట్ల మండలం తొర్తి, మోర్తాడ్ మండలం శెట్‌పల్లి మధ్య పెద్దవాగులో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.4.80 కోట్లు ఖర్చు చేశారు. 2.5 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన చెక్‌డ్యాం ఎత్తును 4 మీటర్లకు పెంచారు. దీంతో నీటి నిలువ సామర్థ్యం ఎక్కువై పంట పొలాల్లోకి నీరు చేరింది. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎలాంటి అనుమతులు లేకుండానే కట్ట ఎత్తును కుదించారు.
● భీమ్‌గల్ మండలం బెజ్జోరా వద్ద కప్పలవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం ఎత్తు అధికంగా ఉండటంతో పొలాలకు నీరు చేరి రైతులు సాగు చేసుకోలేని దుస్థితిలో ఉండిపోయారు.
నేతలదే హవా..
చెక్‌డ్యాంల నిర్మాణంలో ఇంజినీర్ల మాట కంటే అప్పటి అధికార పార్టీ నేతల మాటనే నెగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైడ్రాలిక్ అనుమతులు తీసుకోకపోవడం, సుమోటో అనుమతులతోనే చెక్‌డ్యాంలు నిర్మించడంతో ప్రకృతి ప్రకోపానికి రైతులు నష్టపోవాల్సి వచ్చింది.
రైతులకు న్యాయం చేయాలి
చెక్‌డ్యాంల నిర్మాణంతో రైతులకు మేలు కంటే కీడు ఎక్కువ జరిగింది. అప్పట్లో అధికార పార్టీ నేతలకు వి న్నవిస్తే వారు లెక్కచేయలేదు. రైతు ల పట్ల దురుసుగా వ్యవహరించా రు. విచారణ జరిపి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి.
– నవీన్ యాదవ్, రైతు, సుంకెట్
తుది నివేదిక ఎక్కడ?
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెక్‌డ్యాంల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విభాగానికి ఆ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. స్పందించిన విజిలెన్స్ అధికారులు నీటి పారుదల శాఖ నుంచి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల బృందం చెక్‌డ్యాంలను పరిశీలించి వెళ్లింది. కానీ, ఇప్పటి వరకు తుది నివేదికను అందించకపోవడం గమనార్హం.

అటకెక్కిన విజిలెన్స్ విచారణ

అటకెక్కిన విజిలెన్స్ విచారణ

అటకెక్కిన విజిలెన్స్ విచారణ