
బాలికల హాస్టల్ మెస్‌లో భోజనం చేస్తున్న వీసీ రవీందర్, చీఫ్ వార్డెన్ మహేందర్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ బాలికల హాస్టల్‌ను వీసీ డి రవీందర్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఇటీవల కొందరు బాలికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హాస్టల్‌లో విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి వీసీ భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హాస్టల్ విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. హాస్టల్స్ చీఫ్ వార్డెన్ మహేందర్, వార్డెన్ జవేరియా ఉజ్మా, ఏఈ వినోద్, సూపరింటెండెంట్ భాస్కర్ పాల్గొన్నారు.
‘గ్లోబల్ ఫ్యాకల్టీ అవార్డు’ గర్వకారణం
తెయూ(డిచ్‌పల్లి): ఎకనామిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వప్న జాతీయ స్థాయిలో బోధన, పరిశోధనలో ప్రతిభ కనబరిచి గ్లోబల్ అవార్డు అందుకోవడం యూనివర్సిటీకి గర్వకారణమని వీసీ రవీందర్‌గుప్తా అన్నారు. శుక్రవారం అవార్డు గ్రహీత స్వప్నను వీసీ తన ఛాంబర్‌లో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. స్వప్నకు పాలకమండలి సభ్యులు కే రవీందర్‌రెడ్డి, ఎకనామిక్స్ విభాగాధిపతి సంపత్, బీవోఎస్ చైర్మన్ పున్నయ్య, అధ్యాపకులు నాగరాజు, శ్రీనివాస్, దత్తహరి, న్యాయ శాస్త్ర విభాగాధిపతి స్రవంతి అభినందనలు తెలిపారు.