
నాగిరెడ్డిపేట: మండలంలోని నాగిరెడ్డిపేటలో గల కల్లు దుకాణంలో గురువారం రాత్రి కొనుగోలు చేసిన కల్లుసీసాలో బొద్దింక ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దుకాణంలో కొనుగోలు చేసిన కల్లుసీసాను ఇంటికి తీసుకువెళ్లి తాగే క్రమంలో అందులో బొద్దింక కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన సదరు వ్యక్తి కల్లుసీసాను తీసుకొని స్థానికులతో కలిసి దుకాణానికి వెళ్లి నిర్వాహకులను నిలదీశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని నిర్వాహకులు గ్రామస్తులకు నచ్చజెప్పి పంపించారు.
భారీ వాహనం బోల్తా
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలం చేపూర్ శివారులో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం భారీ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. జగిత్యాల జిల్లా నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న వాహనం చేపూర్ శివారు మూలమలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది.
గంజాయి కేసులో ఐదేళ్ల జైలు
ఖలీల్‌వాడి: గంజాయి రవాణ చేస్తూ పట్టుబడిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మొదటి అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి శ్రీనివాస్‌రావు తీర్పు వెలువరించారు. కోర్టు తీర్పు వివరాలు.. నిజామాబాద్‌లోని మర్వాడిగల్లీలోని రాంగోపాల్‌వీధికి చెందిన భగవాన్‌దాస్‌చౌదరి చిన్న వయస్సు నుంచే గంజాయి రవాణా చేసేవాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న, చిన్న ప్యాకెట్లులో పెట్టి రూ.200కు అమ్మేవాడు. 2019 ఆగస్టు 7న గంజాయి పౌడర్‌ను నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి తీసుకొని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీనిపై ఒకటో టౌన్ సీఐ ఆంజనేయులు కేసు నమోదు చేసి విచారణ పూర్తి అయిన తర్వాత నిందితుడిపై అభియోగ పత్రం కోర్టులో దాఖలు చేశారు. విచారణ అనంతరం కోర్టు నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనర్సయ్య వాదనలు వినిపించారు. కార్యక్రమంలో కోర్టు లైజన్ అధికారి శ్యాంకుమార్, విట్‌నెస్ బ్రీఫింగ్ ఆఫీసర్ విజయ్‌బాబు, కోర్టు కానిస్టేబుల్ గజానంద్, హెచ్‌జీ రవి తీర్పు సమయంలో హాజరయ్యారు.
పొలంలో పడి రైతు మృతి
రామారెడ్డి: పొలానికి వెళ్లిన రైతు ఫిట్స్ వచ్చి పొలంలో పడి మృతి చెందిన ఘటన గురువా రం మండలంలోని అన్నారంలో చోటు చేసుకుంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు.. గ్రా మానికి చెందిన రాజయ్య అల్లుడు పుట్టి బాలకృష్ణ(35) గురువారం ఉదయం పొలానికి వెళ్లాడు. సాయంత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా పొలంలో విగతజీవిగా పడి ఉన్నాడు. తన భర్తకు ఫిట్స్ వచ్చి పొలంలో బోర్ల పడటంతో ఊపిరాడక మృతి చెందాడని ఆయన భార్య సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
బోధన్‌టౌన్: బోధన్ శివారులో పెగడాపల్లి రోడ్డు పక్కన గల కాలువలో శుక్రవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కాలువలో మృతదేహాన్ని చూసిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిందని, వారం క్రితం మృతి చెంది ఉండవచ్చని సీఐ ప్రేమ్‌కుమార్ పేర్కొన్నారు. మృతురాలి వయసు 40 నుంచి 45 ఏళ్లు ఉంటాయన్నారు.